తిరుమలగిరి, డిసెంబర్ 26 : ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా సూర్యాపేట జిల్లాలో యాసంగి సాగుకు గోదావరి జలాలను సోమవారం నీటిపారుదల శాఖ అధికారులు జనగాం జిల్లా కొడకండ్ల మండలంలోని బయ్యన్నవాగు నుంచి విడుదల చేశారు. గోదావరి జలాలు మంగళవారం ఉదయం వరకు తిరుమలగిరి మండలంలోని వెలిశాల వద్ద గల 69 డీబీఎంకు చేరనున్నాయి. గతేడాది డిసెంబర్ 28న నీటిని విడుదల చేయగా ఈ సారి రెండు రోజుల ముందుగానే ఎస్సారెస్పీ జలాలు జిల్లాకు చేరాయి. నీటిని 56 రోజులు విడుదల చేయనున్నారు. గత యాసంగి సీజన్లో 3.36 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల కాగా ఈ సారి కూడా అంతే మొత్తంలో అందనున్నాయి. అయితే గతేడాది ఏప్రిల్ 3వరకు మాత్రమే నీరందగా ఈ సారి ఏప్రిల్ 15 వరకు సాగునీరు అందనున్నది. వారబందీ పద్ధతిలో ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదట 500 క్యూసెక్కుల చొప్పున వదిలి తర్వాత పెంచనున్నారు.
రెండు పంటలకు సాగునీరు
మూడేండ్లుగా ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలను తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా అందిస్తుండడంతో కరువు ప్రాంతాలైన తుంగతుర్తి, సూర్యాపేట నియోజక వర్గాల రైతులకు లబ్ధి చేకూరుతున్నది. తిరుమలగిరి మండలంలోని వెలిశాల 69 డీబీఎం నుంచి తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు, 70 డీబీఎం కాల్వ ద్వారా నాగారం మండలం, 71 డీబీఎంతో నాగారం, అర్వపల్లి మండలాలతో పాటు సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ ఎస్, చివ్వెంల, పెన్పహాడ్, మండలాలతో పాటు కోదాడ నియోజక వర్గంలోని మోతె, నడిగూడెం మండలాల్లోని పలు గ్రామాలకు నీరందనున్నది.
వారబందీ విధానంలో …
వారబందీ విధానంలో గోదావరి జలాలు విడుదల చేయనున్నారు. జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, నియోజక వర్గాల్లో ఎస్సారెస్పీ రెండవ దశ కింద 2,23,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ సీజన్లో పూర్తి ఆయకుట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని, నీటిని వృథా చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.