యాదగిరిగుట్ట, జూలై 28 : యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీనృసింహ వేద విద్యాలయంలో అష్టమ వార్షిక విద్వత్సమ్మేళనం-2024 ఘనంగా జరిగింది. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ సహకారంతో నిర్వహించిన కార్యక్రమం శనివారం ప్రారంభం కాగా ఆదివారం పరిపూర్ణమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి జగద్గురువులు, మహాత్యులు, పీఠాధిపతులు, స్వామీజీలు హాజరయ్యారు. మొదట లక్ష్మీనరసింహ స్వామి వేద విద్యాలయ విద్యార్థులు వేద పారాయణం చేశారు.
ఐనవోలు అనంతమల్లయ్య వేదికపై సభా కార్యక్రమం ప్రారంభం కాగా మరుమాముల వేంకటరమణ శర్మ స్వాగతోపన్యాసం చేశారు. జ్యోతి ప్రజ్వళన అనంతరం సభకు తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు శ్రీయాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అధ్యక్షత వహించారు. భద్రకాళీ దేవస్థానం ధర్మకర్త శేషు శర్మ, తూండ్ల కమలాకర శర్మ, ధర్మశాస్త్ర విషయాలను ప్రవచించారు. ఈ సభలో కొండకండ్ల రాధాకృష్ణ శర్మ బృందం సంకీర్తన, శ్రీమరుమాముల శశిధర్ శర్మ కుటుంబం సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పాండురంగాశ్రమ నిర్వహకులు అప్పాల సత్యనారాయణ శర్మ, ఓరుగంటి మనోహర శర్మ సిద్ధాంతి, హయగ్రీవ గాయత్రి ఆశ్రమ వ్యవస్థాపకుడు, యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులను ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకలో తెలంగాణ విద్వత్సభ సలహాదారులు ఆకెళ్ల జయకృష్ణ సిద్ధాంతి, ఉపాధ్యక్షుడు శ్రీమాన్ కృష్ణమాచార్య సిద్ధాంతి, ప్రధాన కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, సంయుక్త కార్యదర్శి గాడిచర్ల నాగేశ్వర శర్మ సిద్ధాంతి, చికిలి లక్ష్మీ వేంకటేశ్వర శాస్తి సిద్ధాంతి, శృంగేరి ఆస్థాన పండితులు, ప్రముఖ పౌరాణికులు బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి, యాదగిరిగుట్ట దేవస్థాన ఈఓ భాస్కర్రావు, చైర్మన్ బి. నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవిశ్వావసు నామ సంవత్సరం పండుగలకు ఏకోన్ముఖంగా ఆమోదం
జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులతో విద్వద్గోష్టి నిర్వహించారు. రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సర(2025) పండుగలను ఆదివారం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ శర్మ అధ్యక్షత వహించగా విద్వత్సభ సలహాదారులు ఆకెళ్ల జయకృష్ణ శర్మ సిద్ధాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాఈ సందర్భంగా ప్రతి పండుగ, వ్రతం గురించి క్షుణ్ణంగా చర్చించి నిర్ణయించారు. వీటికి అందరూ ఏకోన్ముఖంగా ఆమోదం తెలిపారు.
ముఖ్య పండుగలు ఇలా…
రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో(2025) జరుపుకొనే పండుగలు ఇవి. 2025 మార్చి 3న ఉగాది, ఏప్రిల్ 6న శ్రీరామనవమి, ఏప్రిల్ 30న అక్షయ తృతీయ, డోలా గౌరీ వ్రతం, మే 10న స్మార్త నృసింహ జయంతి, శని త్రయోదశి, మే 11న వైష్ణవ నృసింహ జయంతి, అగ్ని కర్తరీ ప్రారంభం, మే 22న హనుమజ్జయంతి, జూలై 6న సర్వేషాం ఏకాదశి(తొలి ఏకాదశి), అగస్టు 8న వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 16న కృష్ణాష్టమి, ఆగస్టు 27న వినాయక చతుర్ధి, సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య, అక్టోబర్ 22న దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం, అక్టోబర్ 30న దుర్గాష్టమి(బతుకమ్మ పండుగ), నవంబర్ 1న మహార్నవమి, నవంబర్ 2న విజయదశమి, నవంబర్ 19న నరక చతుర్ధశి, నవంబర్ 20న దీపావళి పండుగ, ధనలక్ష్మి పూజ, 21న కేదార వ్రతం, డిసెంబర్ 16న ధనుర్మాస వ్రతారంభం, 2026వ సంవత్సరంలో జనవరి 14న భోగి పండుగ, మకర సంక్రమణం, 15న సంక్రాంతి పండుగ, జనవరి 23న వసంత పంచమి, జనవరి 25న రథ సప్తమి, ఫిబ్రవరి 15న మహా శివరాత్రి, మార్చి 3న హోలి పండుగలను జరుపాలని నిశ్చయించారు.