కట్టంగూర్, ఆగస్టు 10 : ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మండలంలోని అన్ని గ్రామాల్లో మినీ ట్యాంకులు నిర్మించారు. కానీ వాటిని శుభ్రం చేయకపోవడంతో మంచినీరు కలుషితమవుతున్నాయి. ట్యాంకులు సరైన మూతలు లేకుండా, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉంటున్నాయి. విధిలేని పరిస్థితుల్లో ప్రజలు ఆ నీటినే తాగుతూ రోగాల పాలవుతున్నారు.
కట్టంగూర్‌లోని శివాలయం వద్ద ఉన్న మినీ ట్యాంకులోని నీటిని శుక్రవారం ఆ ప్రాంత ప్రజలు తీసుకెళ్లగా అందులో వానపాములు కనిపించాయి. కొన్ని నెలల నుంచి ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో తాగునీరు ఇలాగే కలుషితమై వస్తున్నదని ప్రజలు చెబుతున్నారు.
మంచినీటిలో వానపాములు వచ్చాయనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో స్పందించిన పంచాయతీ సిబ్బంది వెంటనే ట్యాంకును శుభ్రం చేశారు. వారం రోజులుగా స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని అధికారులు తూతూమంత్రంగా నిర్వహించారే తప్ప ఎక్కడా శుభ్రం చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి నెలా ట్యాంకును బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.