నీలగిరి, ఏప్రిల్ 24 : నల్లగొండ పట్టణంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.25 వేల విలువ కలిగిన మత్తు మాత్రలను, రూ.22 వేల నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
బుధవారం ఉదయం మునుగోడు రోడ్లో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సందీప్ రెడ్డి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వ్యక్తిని నల్లగొండలోని అక్కచల్మాకు చెందిన మహమ్మద్ ఖాజా వసీముద్దీన్గా గుర్తించినట్లు తెలిపారు. అతను కొంతకాలంగా స్పాస్మో టాబ్లెట్స్ తీసుకుంటున్నాడు. వాటికి బానిసై ఈజీ మనీ కోసం అతడి స్నేహితులు ఖాజా షోయబ్, అమ్మేర్ను టీమ్ సభ్యులుగా చేర్చుకున్నాడు. నల్లగొండ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో ఈ మాత్రను సేకరించేవారన్నారు. ఇక్కడ నిఘా పెరగడంతో గత ఆరు మాసాల నుండి పిడుగురాళ్లలోని ఛాయా మెడికల్ షాప్ నిర్వాహకుడు మణిదీప్ కు పరిచయమై ఒక్క షీట్ రూ.100కు కొనుగోలు చేసి వాటిని అవసరం ఉన్నవారికి రూ.180 కి అమ్మి డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో మహమ్మద్ వసీముద్దీన్ 288 టాబ్లెట్ షీట్లు తీసుకుని అవసరం ఉన్నవారికి అమ్మడానికి వెళ్తుండగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ విక్రయంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న మహమ్మద్ ఫసియుద్దీన్, మెడికల్ షాప్ నిర్వాహకుడు మణిదీప్, స్నేహితులు ఖాజా షోయెబ్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో రిమాండ్ చేసినట్టు చెప్పారు. మరో స్నేహితుడు అమేర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిబ్బంది రబ్బాని, వెంకటనారాయణ, కిరణ్, శ్రీకాంత్, సైదులు పాల్గొన్నారు.