సూర్యాపేట, సెప్టెంబర్ 12 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలుగా నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేసిన విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు మిన్న శివరామకృష్ణ, విజయలక్ష్మి దంపతులు తమ సామాజిక బాధ్యతను మరోసారి చాటుకున్నారు. ఇటీవల పెన్‌పహాడ్ మండలం అనంతరం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులు భీపంగ యశ్వంత్ నీట్లో 1,301 ర్యాంక్ సాధించి ఉస్మానియాలో, మామిడి ఇందు నీట్ లో 10,150 ర్యాంక్‌తో గాంధీ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం పట్ల అభినందిస్తూ ఒక్కొక్కరికి రూ :25 వేల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు మొదటి సంవత్సరానికి ఉపయోగపడే పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మిన్న శివరామకృష్ణ, విజయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఉన్నత వైద్య విద్యలో సీటు సాధించడం ఆనందంగా ఉందన్నారు.
వారు ఇరువురు పేదరికంలో ఉన్నారని చదువుకునేందుకు పేదరికం అడ్డు కాకూడదని ఆలోచనతో తాము ఈ ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. సమాజం కూడా స్పందించి వారి వైద్య విద్యకు సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే ద్వితీయ, తృతీయ సంవత్సరాలలో కూడా ఇరువురి విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలను తమ ద్వారా అందజేస్తామన్నారు. డాక్టర్ దంపతుల దాతృత్వం పట్ల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. దాతలు అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి నిరుపేదలకు వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు.