– నల్లగొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్
నీలగిరి, ఏప్రిల్ 22 : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా దరిత్రితో పాటు, ప్రకృతి పెను విపత్తును ఎదుర్కొంటున్నదని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ” అంతర్జాతీయ మాతృ భూమి” దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని కేంద్రీయ విద్యాలయ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని కేంద్రీయ విద్యాలయ వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ప్రపంచం పెను ప్రమాదంలో చిక్కుకుందని, దీనివల్ల వాతావరణ, జల, భూమి కాలుష్యాలు ఏర్పడుతున్నాయన్నారు. మానవ తప్పిదాలు, వివాదాల వల్ల మనుషులతో పాటు, జంతుజాలానికి కూడా ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్లాస్టిక్ వినియోగం అనంతరం డీకంపోస్టు చేయకపోవడం వల్ల ఇది భూమితో పాటు, ప్రకృతిని నాశనం చేస్తున్నదని, దీని నుండి బయట పడేందుకు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున మొక్కలు నాటి దరిత్రిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
మొక్కలు నాటి సంరక్షించడంతో పాటు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ఒకవేళ వాడినట్లైతే తిరిగి దానిని వినియోగించడం, రీసైకిల్ చేయడం వంటి వాటిపై దృష్టి సారించాలని, ఈ నినాదం ప్రతి గృహానికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అప్పుడే మనం భూమిని, ప్రకృతిని కాపాడగలుగుతామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం లో భాగంగా ప్రతి ఒక్కరూ బయటికి,లేదా మార్కెట్ కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా కాటన్ చేతి సంచులు వాడాలని, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కు బదులు స్టీల్ లేదా మట్టి బాటిల్స్ వాడడం, ప్లాస్టిక్ మెటీరియల్ వాడకుండా చూడాలని, ఈ విషయంపై అన్ని చోట్ల అవగాహన కల్పించాలని తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్నిచోట్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రకృతిని కాపాడే అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు.“అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం” సందర్భంగా ప్రతి ఒక్కరు భూమి కి ప్రతిరూపమైన అమ్మను గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని, అప్పుడే మనం అనుకున్న అందమైన జీవితాన్ని గడపగలుగుతామన్నారు.
డీఎఫ్ఓ రాజశేఖర్, జిల్లా యువజన ,క్రీడల అభివృద్ధి శాఖ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, జిల్లా సైన్స్ అధికారి తదితరులు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీకి హాజరైన వారందరి చేత “అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవ” ప్రతిజ్ఞను చేయించారు. అంతేకాక అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం పై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులు విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకండి.. ప్రకృతిని కాపాడండి’