మిర్యాలగూడ, జనవరి19 : ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో ప్లాట్లు కొంటే ఇబ్బందులు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లు చేస్తున్న వైనంపై ఇటీవల నమస్తే తెలంగాణ దినపత్రిలో ప్రచురితమైన ‘ప్రభుత్వ భూమిపై పాగా’ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ విషయమై పరిశీలించాలని డీపీఓను ఆదేశించారు. దాంతో గురువారం ఆయన మిర్యాలగూడ తాసీల్దార్ అనిల్‌కుమార్‌తో కలిసి జప్తీవీరప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్, కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించారు.
ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ లేఅవుట్ చేయాలంటే ముందుగా తాత్కాలిక లేఅవుట్ పర్మిషన్ తీసుకోవాలని, తర్వాత గ్రామపంచాయతీకి 10 శాతం భూమి పట్టా చేయాలని, మరో 15 శాతం పాట్లు పంచాయతీకి మార్టిగేజ్ చేయాలన్నారు. ఆ తర్వాత పూర్తిగా ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలిక వసతులు ఏర్పాటు చేశాకే ప్లాట్లు విక్రయించాలని సూచించారు. ఎటువంటి అనుమతులు లేకుండా మ్యాప్‌ను చూసి ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని ప్రజలకు సూచించారు. తాసీల్దార్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీఓ వీరారెడ్డి, ఆర్ఐ శ్యాంసుందర్ ఉన్నారు.