నార్కట్‌పల్లి ఆగస్టు 26 : రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మానవతావాది అని నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శుక్రవారం నార్కట్‌పల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో పట్టణానికి చెందిన 294 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 57 ఏండ్లు నిండిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు సీఎం కేసీఆర్ కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా మన రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పింఛన్లు, ఉచిత విద్యత్ వంటి పథకాలు లేవని పేర్కొన్నారు. గుజరాత్లో కేవలం రూ.600 పింఛన్ మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతీవెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, దుబ్బాక పావనీశ్రీధర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు దోసపాటి విష్ణుమూర్తి, కో ఆప్షన్ సభ్యుడు వాజిద్ అలీ, వార్డు సభ్యుడు మేడబోయిన శ్రీనివాసులు పాల్గొన్నారు.