నార్కట్పల్లి, ఫిబ్రవరి 16 : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ మహా మండపంలో వేద పండితులు గణపతి పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పుణ్యాహవాచనం, పంచజన్య, పూజాప్రోక్షణ, అఖండ స్థాపన, త్రిశూ ల పూజ, సూర్య నమస్కార పూజలు చేశారు. అగ్ని ప్రతిష్ఠ సృష్ఠికర్త బ్రహ్మ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు.
జాతర ప్రారంభోత్సవంలో ఆర్డీఓ రవి, డీఎస్పీ శివరాం రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప పాల్గొన్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రి నుంచే భక్తులు గుట్టపైకి చేరుకుంటున్నారు. కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ప్రభుత్వం తరపున తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు తీసుకురానున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాట్లను ఎస్పీ చందన దీప్తి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆమె వెంట డీఎస్పీ శివరాంరెడ్డి తదితరులు ఉన్నారు.
నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 16 : చెర్వుగట్టు జాతర సందర్భంగా ఈ నెల 18 వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ నల్లగొండ ఆర్ఎం శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు నడుపనున్నట్లు, హైదరాబాద్, భువనగిరి వైపు వెళ్లే ప్రతి ఆర్డీనరీ బస్సు చెర్వుగట్టు మీదుగా వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.