రామన్నపేట, అక్టోబర్ 21 : కాలుష్యకార సిమెంట్ పరిశ్రమలతో అభివృద్ధి శూన్యమని, ప్రజలకు హాని కలిగించే పరిశ్రమను ఏర్పాటుచేయాలని చూస్తే ఊరుకునేది లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి అయినా అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరించారు. మండల కేంద్రంలో అంబుజా సిమెంట్ పరిశ్రమ స్థలంలోని గేట్ వద్ద గ్రామ రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదానీతో కుమ్మక్కై లోపాయికారిగా చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని సిమెంట్ ఫ్యాక్టరీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్కు వంద కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చిన అదానీ ముఖ్యమంత్రి స్కిల్‌కు ఎన్ని వందల కోట్లు ఇచ్చారోనని అనుమానం వ్యక్తం చేశారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు, సాగునీరు ఇచ్చి రైతులకు చేయూత అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. ఇప్పటికే మూసీ కాలుష్యంతో వెనుకబడిన రామన్నపేటను మరో దామరచర్లగా మార్చవద్దన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో మూసీ ఆనావాళ్లు లేకుండా చేయాలని చూస్తుందన్నారు. సిమెంట్ పరిశ్రమ వల్ల ప్రజలు కోలుకోలేని ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆందోళనవ వ్యక్తం చేశారు. కాలుష్య సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును మానుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. 23న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబుజా సిమెంట్ పరిశ్రమ మాకొద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా వెళ్లి రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మాజీ మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, వేమవరపు సుధీర్‌బాబు, గొరిగే నర్సింహ, దోమల సతీశ్, పున్న వెంకటేశం, మాజీ సర్పంచ్‌లు కోళ్ల స్వామి, మెట్టు మహేందర్‌రెడ్డి, రేఖ యాదయ్య, పట్టణ కార్యదర్శి జాడ సంతోశ్, నాయకులు బద్దుల రమేష్, ఎస్కే చాంద్, కూనూరు మత్తయ్య, బత్తుల వెంకటేశ్, మిర్యాల మల్లేశం, బాలగోని శివ, లవణం రాము, రామిని లక్ష్మణ్, కూనూరు శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు బండ శ్రీనివాస్‌రెడ్డి, గర్దాసు విక్రం, గుండాల రాంబాబు, పైళ్ల ప్రతాప్‌రెడ్డి, గంగుల రాఘవరెడ్డి, బొల్లం సతీశ్, జినుకల మల్లేష్, బుర్ర శ్రీశైలం పాల్గొన్నారు.