యాదాద్రి జోన్ పరిధిలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రోజరోజుకూ కొత్త పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 169 శాతం కేసులు పెరిగాయి. మరోవైపు లైంగిక దాడి కేసులు కూడా అధికమయ్యాయి. అలాంటి కేసుల్లో ఎక్కువగా స్నేహితులే దోషులుగా ఉన్నారు. ట్రాఫిక్-1 పరిధిలో 9,505 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాలను రాచకొండ పోలీస్ వార్షిక నివేదిక-2024లో వెల్లడిస్తున్నది.
– యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ)
Cyber Crimes | యాదాద్రి జోన్లో సైబర్ నేరగాళ్ల బెడద పెరుగుతున్నది. ముఖ్యంగా సోషల్ మీడియా, పార్ట్‌టైం జాబ్, ఫిషింగ్, ఫేక్ కస్టమర్ కేర్, లోన్ యాప్ వేధింపులు, జాబ్, వీసా, లోన్లు, గిఫ్ట్, లాటరీ పేరుతో మోసాలు, డేటా చౌర్యం, ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఇతర మార్కెటింగ్ కంపెనీలు, క్రిప్టో, ఇన్వెస్ట్మెంట్, మ్యాట్రిమోనల్ తదితర రకాల పేరుతో సైబర్ నేరాలు చోటుచేసుకున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాది 2,562 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 4,458 కేసులు అయ్యా యి. 42.5శాతం నేరాలు పెరిగాయి. యాదాద్రి జోన్ విషయానికొస్తే.. గతేడాది 49 సైబర్ క్రైమ్ కేసులు ఉండగా, ఈ ఏడాది 132 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 169 శాతం కేసులు పెరిగాయి.
యాదాద్రి జోన్ పరిధిలో 5,576 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. వాటిల్లో 4,368 పరిష్కరించగా, మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి. 1271 కేసుల్లో కోర్టులు శిక్ష విధించాయి. మోటకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సంచలన మర్డర్ కేసులో 14 మందికి జీవిత కారాగార శిక్ష పడింది. ఈ ఏడాది 19 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, గతేడాది 35 కేసులు రిజిస్టర్ అయ్యాయి. డయల్ 100కు 30,909 ఫిర్యాదులు అందాయి. సగటున ప్రతి 10.55 నిమిషాలకు ఒక కాల్ వచ్చింది. 14,503 ఈ-పిటి కేసులు బుక్ అవ్వగా, 9,820 కేసులను పరిష్కరించారు. పలు కేసుల్లో గతేడాది 289 మందికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇవ్వగా, ఆ సంఖ్య ఈసారి 726కి పెరిగింది. భువనగిరి సీసీఎస్ పరిధిలో ఈ ఏడాది దొంగతనాలు, చోరీలు కొద్దిమేర తగ్గుముఖం పట్టాయి. ఈ అంశంలో 60 కేసులు నమోదు కాగా, రూ.78.04 లక్షలను పోలీసులు రికవరీ చేశారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 3,172 మంది మహిళలపై వివిధ రకాల నేరాలు జరిగాయి. ప్రధానంగా లైంగిక దాడి కేసులు పెరిగాయి. కమిషనరేట్ పరిధిలో గతేడాది 327 కేసులు నమోదవగా, ఈ ఏడాది 384 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసుల్లో పోలీసుల దర్యాప్తుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. లైంగిక దాడి కేసుల్ల్లో అధిక శాతం స్నేహితులే ఉన్నట్లు తేలింది. అత్యధికంగా స్నేహితులే (322మంది)ఈ దారుణాలకు పాల్పడినట్లు బయటపడింది. 17 కేసుల్లో ఇరుగు పొరుగు వ్యక్తులు, ఐదుగురు కుటుంబ సభ్యులు, 402 మంది ఇతరుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. మొత్తంగా మహిళలపై నేరాలు 2022తో పోలిస్తే 2023లో 12.10శాతం తగ్గుముఖం పట్టగా, 2024లో మాత్రం 9శాతం మాత్రమే తగ్గడం గమనార్హం.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్-1లో ఈ ఏడాది మొత్తం 9,505 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 77 మందికి జైలు శిక్ష పడింది. కోర్టులు రూ.2.03 కోట్ల జరిమానా విధించాయి. 9,359 మందికి డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో 1,768 మంది డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన 39,356 మందికి చలానా విధించారు. ఓవర్ స్పీడ్‌కు సంబంధించి 16,330, సెల్ ఫోన్ డ్రైవింగ్ 6,840, సిగ్నల్ జంప్ 28,616, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేనివి 36,755, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 63,879, ట్రిపుల్ రైడింగ్ 25,445, నో ఎంట్రీ ఉల్లంఘనలు 18,339, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన కేసులు 39,356, సీటు బెల్ట్ పెట్టుకోని 17,531 కేసుల్లో చలానాలు విధించారు.