యాదగిరిగుట్ట, జూన్ 16 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో తిరు మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, శివాలయం, శ్రీవారి మెట్ల మార్గం కిటకిటలాడాయి. సుమారు 55వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి ధర్శ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీ సేవపై వేంచేపు చేసి జోడు సేవను తిరువీధుల్లో ఊరేగించారు. దర్బార్ సేవలో భాగంగా సువర్ణమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి నక్షత్ర హారతి ఇచ్చారు. అన్ని విభాగాలను కలుపుకొని ఆలయ ఖజానాకు రూ.89,65,064 ఆదాయం సమకూరినట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈఓ భాస్కర్రావు తెలిపారు.