రామగిరి, ఆగస్టు 4: దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డితో కలిసి సీపీఎం జిల్లా విస్తృత స్ధాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మా ట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం తమకు ఓటు వేయ ని ముస్లిం, మైనార్టీల పౌరసత్వాలను రద్దు చేసేందుకు దొడ్డి దారిన ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టిందని విమర్శించారు.
బీహార్‌లో ఎన్నికలవేళ 65 లక్షల ఓట్లను తొలగించారన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రా ష్ట్రాల్లో ఈ ఓట్ల తొలగింపు పక్రియ చేపట్టనున్నారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో మోడీ ప్రభుత్వం అబద్దాలు చెప్పిందని, ఆ విషయం ్రట్రంప్ నేరు గా చెబుతున్నా ప్రధాని నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ట్రంప్ ఇతర దేశాలపై 15 శాతం సుంకాలు విధించి, మన దేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నాడని, ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాల్సిన ధైర్యం మోడీకి లేదన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన కాలయాపనతో సాగుతోందని విమర్శించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా కాళేశ్వరం, బనకచర్ల పేరిట జనం దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం రేవంత్‌రెడ్డికి తెలుసు అని, అయినప్పటికీ ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి ఇప్పుడు కాలయపన చేయడం సరి కాదన్నారు. వాగ్దానాల అమలు కోసం క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనంతరం జరిగిన జిల్లా కమిటి సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిషారం కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, చినపాక లక్ష్మీనారాయణ, సయ్యద్ హాషిం, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.