రామగిరి, మార్చి 21: ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులపై ఎలాంటి వివక్ష చూపకుండా ఒకే లెవల్లో నీటిని సరఫరా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని మఖ్దూమ్ భవన్లో శనివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరందించేందుకు చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 436 మీటర్ల ఎత్తు నుంచే నీటిని తరలించే అవకాశం కల్పిస్తుండగా, డిండి కాల్వకు మాత్రం 440 మీటర్ల ఎత్తు నుంచి మాత్రమే నీటిని తీసుకునేలా నిబంధన పెట్టడం సరికాదన్నారు.
దీనివల్ల నల్లగొండ జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు. డిండి ప్రాజెక్టు విషయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ, కొంతమంది ఇంజనీర్లు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వాయర్లో నీటి మట్టం 440 మీటర్ల నుంచి 436.70 మీటర్లకు తగ్గిన తర్వాత 1,500 క్యూసెకుల నీరు కూడా కేవలం 56 రోజులపాటు మాత్రమే డిండి కాల్వకు అందే పరిస్థితి ఉంటుందన్నారు. దీని వల్ల ప్రభుత్వం నిర్ణయించిన 30 టీఎంసీల నీటికి బదులుగా కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే నల్లగొండ జిల్లాకు వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు.
ఈ పరిస్థితే కొనసాగితే మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమస్య పరిషారం కోసం ఏప్రిల్ 1, 2న టన్నెల్, ఏదుల రిజర్వాయర్ ప్రాజెక్టులను సీపీఐ బృందం సందర్శించి, ఏప్రిల్ 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎండిపోతున్న వరి పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ సీనియన్ నేత బొల్గురి నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పబ్బు వీరస్వామి, ఆర్. అంజచారి, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, నలపరాజు రామలింగయ్య, టి. వెంకటేశ్వర్లు, తుమ్ము బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.