తిరుమలగిరి, డిసెంబర్ 20 : రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. బుధవారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014లో కేసీఆర్ తనను తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రటించారని తెలిపారు.
ఇక్కడి నుంచి రెండు పర్యాయాలు గెలిచి కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందించానని చెప్పారు. అలాగే వెనుకబడిన తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. నెర్రెలు బారిన నేలలకు జలసిరులు తీసుకొచ్చి పల్లెల్లో పచ్చని పంటలు పండేలా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధిని చేసినట్లు చెప్పారు. సమైక్య పాలనలో కక్షలు, కొట్లాటలతో ఉన్న ఈ ప్రాంతంలో ప్రగతి పరుగులు పెట్టించి ప్రశాంత వాతావరణం నెలకొల్పినట్లు గుర్తుచేశారు.
కార్యకర్తలు అధైర్యపడొద్దని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ సూచించారు. తాను ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ను మరింతగా బలోపేతం చేద్దామన్నారు. ప్రజాతీర్పును గౌరవించి ఐదేండ్లపాటు ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని అన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ శ్రేణులు విఫలం కావటం వల్లే ఓటమి చెందాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. అందరూ ఐక్యంగా ఉండి ఏకతాటిపై నడువాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేండ్ల తరువాత రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు.
ఇసుకపై అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుంటే ప్రజాక్షేత్రంలో నిలబెడుతామని హెచ్చరించారు.
సమావేశానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ రజాక్, మున్సిపల్ చైర్మన్లు, మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, బీఆర్ఎస్ గ్రామశాఖలు, అనుబంధ శాఖల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.