పత్తాలేని ట్రాన్స్ఫార్మర్లు, కనెక్షన్లు డీడీలు చెల్లించినా తప్పని పడిగాపులు అందుబాటులో లేని మెటీరియల్ ఏడాది కాలంగా పెండింగ్లోనే పనులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్బడ్జెట్ కేటాయింపులో నిర్లక్ష్యం కేసీఆర్ పాలనలో రెప్పపాటు కరెంటు పోలే.. రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు. ఎన్ని కోట్ల రూపాయలయినా లెక్క చేయకుండా ఖర్చు చేశారు. ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ సక్సెస్ కావడంతో పంటలు మస్తుగ పండినయ్.. రైతుల బతుకులు చింతలేకుండా గడిచినయ్.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్షకుల కష్టాలు పట్టించుకోవడం లేదు. కరెంటు కోతలు మొదలయ్యాయి.
ట్రాన్స్ఫార్మర్ల మీద అధికలోడు పడుతున్నది. తరచూ ట్రిప్ అవుతున్నాయి. మోటర్లు కాలిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి యాదాద్రి జిల్లాలోని పలువురు రైతులు వ్యవసాయానికి కొత్త ట్రాన్స్ ఫార్మర్లు, కనెక్షన్ల కోసం డీడీలు కట్టారు. నెలలుగా గడుస్తున్నా ట్రాన్స్ఫార్మర్ల ఊసేలేదు.. ఒక్క కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. బడ్జెట్ లేదనే సాకుతో జాప్యం చేస్తున్నారు. వాన కాలం ప్రారంభం కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, మే 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్లో ఎకడికకడ సబ్ డివిజన్లు ఉన్నాయి. అయితే రైతులు నేరుగా వినియోగదారుల సేవా కేంద్రం ద్వారా ట్రాన్స్ ఫార్మర్ కనెక్షన్ల కోసం నమోదు చేసుకోవాలి. 25 హెచ్పీ ట్రాన్స్ ఫార్మర్ పొందాలనుకునే రైతులు రూ.5,787 చొప్పున మూడు డీడీలు ముగ్గురు రైతులు విద్యుత్ శాఖ పేరుతో తీయాలి. అలాగే రైతు భూమి పాసుబుక్, ఇంటి కరెంట్ బిల్, రెండు ఫొటోలు ఇవ్వడం ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు నమోదు అవుతుంది.
ఇందులో రైతులు రసీదు కూడా పొందే అవకాశం ఉంది. ఈ రసీదును ఏఈకి అందజేయడం, అనంతరం లైన్మెన్ ద్వారా రైతుకు ఏ మేర స్తంభాలు, వైరు అవసరమవుతుందో అంచనా వేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. పనులు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్ ద్వారా అధికారులు పనులు చేయిస్తారు. జిల్లాలో సుమారు 200 ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు డీడీలు చెల్లించారు. ఒక మోతూర్ సబ్ డివిజన్ పరిధిలోనే 50 వరకు ఉన్నాయి. కానీ ఒక చోట కూడా ట్రాన్స్ఫార్మర్ బిగించిన దాఖలాలు లేవు. రైతులు మాత్రం దిమ్మలు కట్టుకుని.. ఏర్పాట్లు చేసుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో కరెంట్ పనుల కోసం మెటీరియల్ కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఏ ఒక ఐటమ్ కూడా అందుబాటులో లేదు. నల్లగొండ స్టోర్ నుంచి యాదాద్రికి సామగ్రి సరఫరా అవుతున్నది. కానీ ఏడాది కాలంగా వస్తువులు రావడమే గగనం అయ్యింది. కండక్టర్, వైర్, ఐరన్, కేబుల్ తదితర మెటీరియల్ రావడం లేదు. ఆరు నెలల కాలంలో ఒక వలిగొండ సెక్షన్ కు 2కిలోమీటర్ల కండక్టర్ మాత్రమే వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరెంట్ స్తంభాలు సైతం లేవు. సాధారణంగా ఎండాకాలంలోనే కరెంట్ పోల్ సమస్యలు సరిచేస్తుంటారు. విద్యుత్ బాల్ లేకపోవడంతో పనులు చేయడం లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నడూ కరెంటు కష్టాలు కనిపించలేదు. ఎలాంటి చిన్న సమస్య వచ్చినా అప్పటికప్పుడు పరిషరించేవారు. నిధులకు కొదువ ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వలేని దుస్థితి దాపురించింది. వాన కాలం ప్రారంభం కావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ కోసం రైతులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా లాభం ఉండటం లేదు. అధికారులు మాత్రం బడ్జెట్ లేదని, పైనుంచి రావడంలేదని చెప్పుకొస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మర్లను బయట కొనుగోలు చేస్తున్నారు.
నేను 2024 నవంబర్ లో 29న ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీ చెల్లించాను. ట్రాన్స్ఫార్మర్ వస్తుందని ఆశపడ్డాను. అందుకోసం ఏర్పాట్లు కూడా చేశాను. బిగించేందుకు దిమ్మె కట్టాం. ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికే వానకాలం ప్రారంభమైంది.. ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు. ప్రభుత్వం రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి.
-జిట్ట సోములు, రైతు, పొడిచేడు, మోతూర్