భువనగిరి కలెక్టరేట్, మే 25 : గీత కార్మికుల ఆర్థిక ఎదుగుదలను కాంక్షించి, గీత వృత్తిపై ఆధారపడి జీవించే కార్మికుల సంక్షేమం కోసం మండలంలోని నందనంలో ఏర్పాటు చేసిన తాటి నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని జూన్2 వరకు ప్రాంభించాలని మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కల్లు గీత కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఆదివారం మండలంలోని నందనం గ్రామ సమీపంలోని తాటి నీరా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీరా కేంద్రం ఏర్పాటు కోసం రూ.7కోట్లతో పనులు పూర్తి చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా నీరా కేంద్రాన్ని ప్రారంభించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఈ ప్రాంత గీత కార్మికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడిందని గుర్తుచేశారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వృత్తిదారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తోడ్పాటునందించిందని తెలిపారు. వృత్తిలో భాగంగా అనునిత్యం ప్రమాదం అంచున బతుకు పోరాటం చేసే గీతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ హయాంలో సేఫ్టీ మోకులను సైతం అంజేసిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గీత వృత్తిదారులు సగౌరవంగా ఉండేందుకు నీరా పాలసీ తీసుకొచ్చారని చెప్పారు.
అత్యంత ప్రమాదకరమైన గీత వృత్తిలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట కార్మికులు మృత్యువాతపడుతున్నారని, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనందించడం లేదని, ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాటి నీరా ఉత్పత్తుల కేంద్రానికి గౌడ ఆణిముత్యం బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న నీరా కేఫ్‌ను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని కుట్రలు చేస్తున్నదని, దానిని ఉపసంహరించుకోవాలని తెలిపారు. నీరాకు మన దేశంతోపాటు ఇతర దేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉందని, కానీ నీరా ప్లాంట్ ప్రారంభంపై ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని చెప్పారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. గీత కార్మికులకు మద్యం టెండర్లలో రిజర్వేషన్లలను పెంచాలని, గీత కార్మికుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కల్లుగీత కార్మిక పారిశ్రామిక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు అతికం లక్ష్మీనారాయణగౌడ్, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు జనగాం పాండు, ఏవీ కిరణ్‌కుమార్, మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు జకా రాఘవేందర్‌రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్, తుమ్మల వెంకట్‌రెడ్డి, పడమటి మమత, కడమంచి ప్రభాకర్, పలుసం రమేశ్‌గౌడ్, మట్ట ధనుంజయగౌడ్, ర్యాకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.