మోతె, మార్చి 17 : వరి పంట ఎండిపోయిన రైతులను ఆదుకుని ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కొనుకుంట్ల సైదులు అన్నారు. సోమవారం మోతె మండల పరిధిలోని మేకలపాటి తండాలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలువురు రైతులు భూమిని కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేయడం జరిగిందన్నారు. అది పూర్తిగా ఎండిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తెచ్చిన అప్పులు ఎట్లా తీర్చాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఎండిన వరి పొలానికి ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లఘుపతి మల్సూర్, భీమ్లా, లాలూ, లక్ష్మణ్, వీర పాల్గొన్నారు.