భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 21 : భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పురసరించుకొని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎం యంత్రాల రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్లోని ఈవీఎంల గోదాములో ఆదివారం ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 25 శాతం అదనంగా కలిపి 321 బ్యాలెట్ యూనిట్లు, 321 కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా కలిపి 359 వీవీ ప్యాట్లు కేటాయించామన్నారు. జిల్లా కేంద్రంలోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఈవీఎం యంత్రాలను భద్రపరిచామని చెప్పారు. ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి 25 శాతం అదనంగా కలిపి 386 బ్యాలెట్ యూనిట్లు, 386 కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా కలిపి 432 వీవీ ప్యాట్లు కేటాయించామని, వాటిని ఆలేరు ఇండోర్ స్టేడియంలో భద్రపరిచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్షాలోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఆలేరు సహాయ రిటర్నింగ్ అధికారి కె.గంగాధర్, భువగిరి డివిజనల్ అధికారి, భువనగిరి సహాయ రిటర్నింగ్ అధికారి అమరేందర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బట్టు రామచంద్రయ్య, సోమ రవీందర్‌రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, తాసీల్దార్లు దేశ్యా, శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.