మునుగోడు అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. మునుగోడు కేంద్రంగా గురువారం జరుగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వనపర్తి నుంచి హెలికాప్టర్లో నేరుగా మునుగోడుకు
చేరుకోనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలుకడం కోసం ప్రజలు పెద్దఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సభకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం కల్పించడంతో విశేష స్పందన లభిస్తున్నది. మేరకు ఏర్పాట్లు కూడా పూర్తిస్థాయిలో చేశారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్25(నమస్తే తెలంగాణ)/మునుగోడు : మునుగోడు నియోజకవర్గం కేంద్రంలో గురువారం జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గతేడాది ఆగస్టు 20న మునుగోడు ఉప ఎన్నికలకు ముందు నిర్వహించిన విశాలమైన స్థలంలోనే ప్రస్తుత సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మునుగోడు నుంచి చౌటుప్పల్‌కు వెళ్లే దారిలో ఎడమ వైపున ఉన్న స్థలంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. సభ వేదిక, వీఐపీ, మీడియా, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళల గ్యాలరీలను ప్రత్యేకంగా బారీకేడ్లతో ఏర్పాటు చేశారు.
వాటితోపాటు కళాకారుల కోసం మరో వేదికను సిద్ధం చేశారు. ఇక సీఎం కేసీఆర్ హెలికాపర్ట్లో రానున్న నేపథ్యంలో సభా వేదికకు పక్కనే మూడెకరాల్లో హెలిప్యాడ్‌ను రెడీ చేశారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా సభా వేదికకు సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర ప్రముఖులు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అలాగే సీఎం కేసీఆర్ సభకు ప్రజలు కూడా పెద్దఎత్తున తరలివచ్చేందుకు సిద్ధం కావడంతో అందుకనుగుణంగా 25 ఎకరాల్లో సభాస్థలిని సిద్ధం చేశారు. ఇక సభకు ప్రజలు తీసుకొచ్చే వాహనాల కోసం మునుగోడుకు మూడు వైపులా ఎనిమిది చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. చండూరు, నాంపల్లి, మర్రిగూడెం మండలాల నుంచి వచ్చే వారి కోసం తాసీల్దార్ కార్యాలయం ఎదుట, మరికొన్ని చోట్ల పార్కింగ్ స్థలాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. చౌటుప్పుల్, నారాయణపురం, గట్టుప్పల్, మర్రిగూడెంలోని కొన్ని గ్రామాల నుంచి వచ్చే వారి కోసం చౌటుప్పల్ రూట్లోని కాటన్ మిల్లుల వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
వీటితోపాటు మధ్యాహ్నం సభ కావడంతో సభా స్థలంలో ప్రజల కోసం ప్రత్యేకంగా మంచినీటి వసతిని ఏర్పాటు చేస్తున్నారు. సభకు తరలివచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మునుగోడు-చౌటుప్పల్, మునుగోడు- చండూర్ రూట్లలో సభకు వచ్చే వాహనాల రద్దీ ఉండనుండడంతో ఈ మార్గాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి సాధారణ ప్రయాణికులు రాకపోవడమే మంచిదని నిర్వాహకులు సూచిస్తున్నారు. గత వారం రోజులుగా సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం కూడా సభా వేదిక, ఇతర ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, బీఆర్ఎస్ మునుగోడు, చండూరు బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బండ పురుషోత్తంరెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు ఉజ్జని అనిల్‌రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పోలగోని సైదులు గౌడ్, ఐతగోని విజయ్‌కుమార్, బండారు వెంకన్న మధుసూదన్‌రావు, బూతరాజు దశరథ తదితరులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని, హెలిప్యాడ్ నుంచి సభ వేదిక వద్దకు వచ్చే మార్గాలన్నీ తమ ఆధీనంలోకి తీసుకుని భద్రత చర్యలు చేపట్టింది. బాంబ్ స్వాడ్ టీమ్‌లు తనిఖీలు చేశాయి. భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. బుధవారం మునుగోడులో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు, ఇంటెలిజెన్స్ ఎస్పీ జి.కవిత పర్యటించారు. సభా స్థలాన్ని, హెలిప్యాడ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. బందోబస్తు చర్యలపై స్థానిక అధికారులతో సమీక్షించి ఆదేశాలిచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు.