నల్లగొండ ప్రతినిధి, మార్చి1(నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖ పనులను ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూ సేకరణను పూర్తి చేస్తూ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలును వేగిరం చేయాలని సూచించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన చాంబర్లో మునుగోడు నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ అజయ్‌కుమార్, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఇరిగేషన్ అధికారులు రాములు, ప్రభు కల్యాణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్ల పరిధిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలుతోపాటు శశిలేటి వాగు ఫీడర్ చానల్ భూసేకరణ, వెల్మకన్నె ఫీడర్ చానల్, బెండలమ్మ చెరువు, సోలిపురం బ్రిడ్జి, చౌటుప్పల్ మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణాల పురోగతిపై మంత్రి సమీక్షించారు. నీటి పారుదల రంగంలోని ఒక్కో ప్రాజెక్టు వారీగా మంత్రి ప్రత్యేకంగా రివ్యూ చేస్తూ పురోగతిని అడిగి తెలుసుకొన్నారు.
అభివృద్ధి పనుల్లో అలసత్వం చూపొద్దని ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా నీటి పారుదల పనుల్లో వేగం పెరుగాలని, భూసేకరణ ప్రక్రియలో అలసత్వం ఉండవద్దని అధికారులకు సూచించారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టుల నిర్వాసితులకు తక్షణమే ప్లాట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను వేగవంతం చేయాలన్నారు. శశిలేటివాగుకు సంబంధించిన భూసేకరణను పూర్తి చేస్తూ పనుల్లో వేగం పెంచాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సోలిపురం బ్రిడ్జి నిర్మాణం పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఇక చౌటుప్పల్ పట్టణంలో పెండింగ్‌లో ఉన్న మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణంలో జాప్యాన్ని నివారించాలన్నారు. నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయిన కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి పక్కకు పెట్టాలని ఆదేశించారు. మరొకరికి పనులు అప్పగించి త్వరగా నిర్మాణం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. మునుగోడు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తూ మరింత వేగం పెంచాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.