మిర్యాలగూడ, డిసెంబర్ 13 : మానవ సంబంధాలతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని రచయిత, విరసం నాయకుడు అల్లం రాజయ్య అన్నారు. అల్లం కిరణ్ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని లోటస్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కిరణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రపంచంలోని మనుషులందరూ ఒకేలా ఎందుకు ఉండరు, తేడాలు ఎందుకున్నాయి, అందరూ ఒకేలా సమానంగా బతకలేరా అనే ఆలోచనల పరంపర మానవ సంబంధాలను బలపరుస్తుందన్నారు. తెలంగాణలో 1974లోనే ఈ క్రమం మొదలైందని, అదే కాలంలో జన్మించిన కిరణ్ ఎదుగుతున్న కొద్దీ విలువలు నేర్పే కొత్త చదువులు చదవడం నేర్చుకున్నాడని తెలిపారు. గ్రామాల్లోని ఉత్పత్తి విధానం, సామాజిక కుటుంబాల ఆర్థిక విధానంపై లోతుగా అధ్యయనం చేశాడని చెప్పారు. 1999లో రాసిన మనిషి లోపలి విధ్వం సం నవలను ఇంగ్లిష్‌లోకి అనువదించేందుకు కృషి చేశారన్నారు. కిరణ్ సైన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేవాడని, సైన్స్ నశించేది కాదని, అభివృద్ధి చేసేదని తెలిపారు.
ఆయన శాస్త్రీయ పరిశోధనలతో దీర్ఘకాలిక వ్యాధులకు తక్కువ ధరకే మందులు లభించేలా పరిశోధనలు చేశారన్నారు. మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ అల్లం కిరణ్ ఆశయం గొప్పదన్నారు. ఆపరేషన్ లేకుండా బ్రెయిన్ ట్యూమర్‌కు ఔషధాన్ని కనుగొని దానికి పేటెంట్ సాధించారని, దానిని స్వదేశంలో తయారు చేసి తక్కువ ధరకే రోగులకు అందించాలన్న ఆలోచనలతో కిరణ్ అమెరికా వెళ్లారని చెప్పారు. లూసియానా స్టేట్ యూనివర్సిటీలో రక్త ప్రసరణపై రసాయనాల ప్రభావం అన్న అంశంపై శాస్త్ర పరిశోధనలను చేస్తూ ‘4 ఎనిలినో-1, బెంజై ల్ పిపిరిడిన్-4, కార్బోనైట్రేట్ ఔషధాన్ని కనుగొన్నాడని తెలిపారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ విద్యార్థిగా కొనసాగుతున్న కిరణ్ 2007 డిసెంబర్ 13న అమెరికా తుపాకీ సంస్కృతికి బలైనాడని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు కిరణ్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం సైన్స్ టాలెంట్ టెస్ట్, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్త్ట్ర నాయకుడు అంబటి నాగయ్య, మట్టి మనుషుల వేదక కన్వీనర్ వేనేపల్లి పాండురంగారావు, కృష్ణమూర్తి, కస్తూరి ప్రభాకర్, మోహన్‌రుషి, శ్యామ్‌సుందర్‌రెడ్డి, కేతనపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఉదయ, కొండల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.