రామగిరి, ఏప్రిల్09 : పేదల కోసం జీవితాంతం పోరాడిన మహా నేత, కమ్యూనిస్టు ఉద్యమ దార్శనికుడు చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దూం భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేశ్వరరావు జీవితం పేదలు, రైతులు, కార్మికుల కోసం సాగిన నిరంతర పోరాటానికి ప్రతీక అని అన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపన కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేయడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణా సాయుధ పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగి, దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు.
కష్టకాలాల్లో కూడా సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని ముందుకు నడిపించిన నాయకుడిగా ఆయన నిలిచారని కొనియాడారు. కార్మికులు, రైతుల హక్కుల కోసం ఆయన చేసిన ఉద్యమాలు నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. రాజేశ్వరరావు సరళ జీవనశైలి, నిస్వార్థ సేవాభావం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సత్యం సూచించారు. సమాజ మార్పు కోసం కట్టుబడి పనిచేసిన ఆయన త్యాగాలు ఎన్నటికీ మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శిలు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు, వై.వీరస్వామి, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, నాయకులు ఎం.నందం, రేపాక లక్ష్మిపతి, తెల్లగమల్ల దశరథ, పుట్టల సుజాత, కార్యకర్తలు పాల్గొన్నారు.