
నల్లగొండ: ప్రాచీన దేవాలయాలను పరిరక్షించాలని, నాటి వాస్తు, శిల్పకళను భవిష్యత్ తరాలకు అందించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి, ప్రముఖ సాహితీవేత్త నందివెలుగు ముక్తేశ్వరరావు అన్నారు. పానగల్లులోని ఛాయా సోమేశ్వరాలయ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ జరిగిన ఆన్లైన్ అష్టావధానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాచీన దేవాలయాలకు ప్రచారం కల్పించాలని ‘తటవర్తి అవధానార్చన’ కార్యక్రమంలో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన అష్టావధాని తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి ఈ అష్టావధానం చేశారు.
పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం మహిమాన్విత క్షేత్రమని ముక్తేశ్వరరావు కొనియాడారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా దేవాలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ.. పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రభుత్వం, దాతల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రముఖ చరిత్రకారులు సూర్య కుమార్ మాట్లాడుతూ.. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు చెక్కు చెదరకుండా ఉన్న ఈ ఆలయం ప్రపంచ ఆర్కిటెక్చర్లోనే ఒక విశేషమని పేర్కొన్నారు. అవధాని తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి ఛాయా సోమేశ్వరుడిని కీర్తిస్తూ అద్భుతమైన పద్యాలు చెప్పారు.
కార్యక్రమంలో సంచాలకులుగా ఆస్ట్రేలియాకు చెందిన సాహితీవేత్త డాక్టర్ వేణుగోపాల్ రాజుపాలెం వ్యవహరించారు. నిషిద్ధాక్షరి పృచ్చకులుగా సాగర్ల సత్తయ్య, సమస్యా పూరణం – గౌతం లింగా (దక్షిణాఫ్రికా), దత్తపది – శ్రీనివాస భరద్వాజ్ కిషోర్ (అమెరికా), వర్ణన – జ్యోతి విందమూరి (న్యూజిలాండ్), ఆశువు – ఉప్పల పద్మ (ఇండియా), అప్రస్తుత ప్రసంగం – రాపోలు సీతారామరాజు (దక్షిణాఫ్రికా), న్యస్తాక్షరి – రాధిక మంగిపూడి (ఇండియా), చిత్రానికి పద్యం – గోపి వి ప్రసాద్ (జర్మనీ) నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభాకర్ రావు, ఎంవీ గోనారెడ్డి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.