రామగిరి, మార్చి 31: నల్లగొండలో ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన మూల్యాంకనం విధుల్లో జూనియర్లకు అందలం వేస్తూ.. సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తున్నది. మూల్యాకంనం కేంద్రంలో ఓ సబ్జెక్టు వద్ద(చీఫ్ ఎగ్జామినర్(సీఈ), ఎస్ ఈ సబ్జెక్ట్ ఎక్స ఫర్ట్ అందుబాటులో ఉండడం లేదని, మిగిలిన సబ్జెక్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఓ అధ్యాపకుడు ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్, అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ అధికారితోపాటు ఇతర అధికారులు బయటకు రాకుండా కప్పిపుచే ప్రయత్నం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం జరుగుతున్నది. కాగా, పేపర్ వాల్యూయేషన్ బాధ్యతలు జూనియర్ కళాశాలల అధ్యాపకులకు అప్పగిస్తూ గురుకుల, మోడల్ స్కూల్ అధ్యాపకులు, సీనియర్ ఉన్నా వారికి అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తున్నది. మూల్యాంకనం కేంద్రంలో కనీస మౌలిక వసతులు కూడా కల్పించడం లేదని, మంచినీళ్లు కూడా ఇంటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తున్నదని పలువురు అధ్యాపకులు వాపోతున్నారు. గతంలో పేపర్ దిద్దడానికి పెన్నులు, పెన్సిల్స్ ఇతర సామాగ్రి ఇచ్చేవారు. ఈసారి అవి కూడా అందించడం లేదు. కనీసం రూమ్ శుభ్రంగా ఉంచడం లేదని, టాయిలెట్లు అధ్వానంగా ఉన్నాయని పలువురు వాపోతున్నారు. ఫ్రశ్నించిన అధ్యాపకుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మూల్యాంకనం కేంద్రం వెలుపల పలువురు అధ్యాపకులు చర్చించుకుంటున్నారు. సంబంధిత స్పాట్ వ్యాల్యూయేషన్ కేంద్రం అధికారులు, డీఐఈఓకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
బోర్డుకు ఫిర్యాదు..
నల్లగొండ ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో చీప్ ఎగ్జామీనర్లు, సబ్జెక్ట్ ఎక్స్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, మౌలిక వసతులు లేవని, పరిశుభ్రత పాటించడం లేదని, ఇష్టారాజ్యంగా అధికారులు వ్యహరిస్తున్నారని తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారితోపాటు బోర్డు అధికారులకు సబ్జెక్టు మూల్యాంకనం చేసే అధ్యాపకుడు ఒకరు ఫిర్యాదు చేశారు. దాంతో వాల్యూయేషన్ కేంద్రం బాధ్యులపై బోర్డు అధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా, ఈ విషయమై నల్లగొండ డీఐఈఓ దస్రూనాయక్ ను నమస్తే తెలంగాణ వివరణ కోరగా.. మూల్యాంకనం విధులను వివిధ హోదాల్లో సీనియారిటీ ప్రకారం బోర్డు నిబందనలు పాటిస్తూ కేటాయించినట్టు తెలిపారు. కొన్ని సబ్జెక్టులో సీనియర్లు లేనప్పుడు జూనియర్లకు అవకాశం కల్పిస్తానన్నారు. మూల్యాంకనం కేంద్రంలో అందరూ స్రకమంగా పని చేస్తున్నారని, అన్ని వస్తువులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.