నల్లగొండ, అక్టోబర్ 5 : పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. నల్లగొండ జిల్లాలో జిన్నింగ్ మిల్లులున్న 7 చోట్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా ఈ నెల చివరి వారం నుంచి కొనుగోళ్లు జరుపనున్నది. మద్దతు ధర క్వింటాకు రూ.7,020 కాగా, విక్రయాల సమయంలో రైతులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో రైతులు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 5,66,850 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. 39,44,251 ఉత్పత్తి వస్తుందన్నది అంచనా.
జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలం సీజన్లో పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. దాంతో జిల్లాలో పత్తి కొనుగోళ్ల మార్కెటింగ్ యంత్రాం గం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే తొలి దఫాలో పంట వేసిన రైతులకు మైల పత్తి వస్తున్న నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బహిరంగ మార్కెట్లో ధరను బట్టి సీసీఐ కేంద్రాలకు పత్తి ఏ మేరకు వస్తుందో అనేది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తొలి దశలో వచ్చే పంట పెద్దగా క్వాలిటీ లేకపోవడంతో రైతులు అక్కడక్కడా క్వింటాకి రూ.6,300 నుంచి రూ.6,800 వరకు విక్రయిస్తున్నారు. రెండో దశలో ఏరే పత్తి క్వాలిటీ వస్తే బహిరంగ మార్కెట్లో ధరను బట్టి సీసీఐ కేంద్రాల ఉనికి తెలుస్తున్నది. అయితే తక్కువ ధరకు దళారులకు అమ్మి మోస పోవద్దని అదికారులు రైతులకు సూచిస్తున్నారు.
గతేడాది పది వేల దాక అమ్మిన రైతులు..
జిల్లాలో పండించిన పత్తికి గతేడాది మంచి ధరనే పలికింది. సీసీఐ క్వింటాకు రూ.6,380 ఇవ్వగా బహిరంగ మార్కెట్లో క్వాలిటీని బట్టి ధర అంచనాలకు మించి పలికింది. ఆరంభంలో ఆరేడు వేలే పలికిన క్వింటా ధర రెండు, మూడో దశలో ఏరిన పత్తికి కొన్ని ప్రాంతాల్లో రూ. 10 వేల దాక పలికింది. దాంతో ఈ సారి కూడ అంతస్థ్దాయిలో ఉండే అవకాశం ఉన్నట్లు రైతులు అంచనా వేస్తున్నారు. అంతలా పెరిగిన ధర చివరి దశలో మల్లీ ఆరేడు వేలకు రావడంతో కొందరు రైతులు ఆ దశ పత్తిని ఇంట్లోనే నిల్వ చేసుకోని ఇప్పటికి అమ్మలేదు. ఈ సారి బహిరంగ మార్కెట్లో మంచి ధర వస్తే అమ్మడం లేదంటే మద్దతు ధర ఇచ్చే సీసీఐ కేంద్రాలకు తరలించటం జరిగే అవకాశం ఉంది.
బయోమెట్రిక్ తప్పని సరి..
పత్తి విక్రయించాలి అనుకునే రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని మార్కెటింగ్ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి కేంద్రంలో బయోమెట్రిక్ తప్పని సరి చేశారు. మొదట బయోమెట్రిక్ అయిన తర్వాతనే పత్తి కొనుగోలు చేసి ఆ తర్వాత పాస్ బుక్‌లు, బ్యాంక్ ఖాతాలు తీసుకోనున్నారు.ఈ సీజన్లో జిల్లాలో ఈ ఏడాది 5.66 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 39.44 లక్షల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. ఇందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో మార్కెటింగ్ శాఖ యంత్రాంగం మానిటరింగ్‌తో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం నల్లగొండతో పాటు మల్లేపల్లి, మాల్, చండూర్, నకిరేకల్, చిట్యాల, శాలిగౌరారం జిన్నింగ్ మిల్లులు ఉండటంతో ఆక్కడ సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో ఏడు కేంద్రాలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం
జిల్లాలో ఈ సీజన్లో పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు ప్రస్తుతం జిన్నింగ్ మిల్లులు ఉన్న ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల చివరి వారంలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రతి రైతుకు బయోమెట్రిక్ ఉన్నందున తన ఆదార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి.
– శ్రీకాంత్, జిల్లా మార్కెటింగ్
అధికారి,నల్లగొండ