బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆదివారం ఉమ్మడి జిల్లాలో గురుకులా బాట చేపట్టారు. ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించి సౌకర్యాలు, వంట గదులు, పరిశుభ్రత, ఆహార నాణ్యత తదితర వాటిని పరిశీలించారు. హాస్టళ్లలోని సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
సూర్యాపేట టౌన్, డిసెంబర్ 1 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల డిగ్రీ గురుకుల కాలేజీతోపాటు పలు సంక్షేమ హాస్టళ్లను బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు శిగ వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు కలుషిత ఆహారం, అసౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గురుకులాలను స్థాపించి ఎంతో మందికి నాణ్యమైన విద్యతోపాటు భోజనం అందించారని తెలిపారు. కానీ రేవంత్ సర్కారు గురుకుల పాఠశాలలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు సరైన పోషకాలు అందించడంలో విఫలమయ్యారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాస్టళ్లను సందర్శించినప్పుడు నాణ్యమైన భోజనం పెడుతున్నారని, మిగతా రోజుల్లో బాగా ఉండడం లేదని విద్యార్థులు చెబుతున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇకనైనా మేలుకొని గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకులు రాపోలు నవీన్‌కుమార్, నెమ్మాది శ్రవణ్‌కుమార్, బానోతు సురేశ్‌నాయక్, గుండాల సందీప్, పల్లెపంగు నాగరాజు, రమావత్ అశోక్‌నాయక్, వడ్డెపల్లి సందీప్, వేల్పుకొండ రామకృష్ణ తదితరులు ఉన్నారు.
మెనూ ప్రకారం భోజనం ఏది? : బీఆర్ఎస్వీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కడారి స్వామి యాదవ్
నల్లగొండ సిటీ : గురుకులాల్లో విద్యార్థులకు కనీస వసతులు లేవని, తాగునీరు, కడుక్కోవడానికి నల్లాలు లేవని బీఆర్ఎస్వీ వైస్‌ప్రెసిడెంట్ కడారి స్వామియాదవ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో గురుకులాలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు వసతులు లేకుండా పోయాయని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నల్లగొండ పట్టణంలోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. తొలుత కేజీబీలోకి అనుమతి లేదని సిబ్బంది నిరాకరించారు. తర్వాత లోనికి వెళ్లి పలు పదార్థాలను పరిశీలిస్తుండగా ఎందుకు వచ్చారని నిర్వాహకులు బెదిరింపు ధోరణకి దిగారు. అనంతరం కడారి స్వామియాదవ్ మాట్లాడుతూ వంట గదితో పాటు వాటరు సింకు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. విద్యార్థులకు మోనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు. అక్కడే బయట ఉన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులను హాస్టల్లో వసతులు గురించి అడుగగా తమ పిల్లలకు తామే ఇంటినుంచి ప్లేట్లు తెస్తున్నామని, చలి కాలం కనీసం వారికి దుప్పట్లు కూడా అందిచడం లేదని చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్, బొమ్మరబోయిన నాగార్జున, మిదున్ప్రసాద్, నలపరాజు పరమేశ్, రవి, లింగస్వామి, రాజు, వెంకన్న తదితరులు ఉన్నారు.