సూర్యాపేట, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమ కాలం నుంచి పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేద, మధ్య తరగతి జీవితాల్లో వెలుగులు నింపాయి. ఈ నేపథ్యంలో 25 ఏండ్ల గులాబీ పార్టీ పండుగకు సబ్బండ వర్గాల ప్రజలు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా రైతులు వినూత్న రీతిలో సభకు వచ్చేలా ఎడ్ల బండ్లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పాలనలో సాగు నీళ్లు రాక, కరెంట్ సరిగా లేక పంటలు ఎండిన రైతులు కడుపుకాలి రేవంత్‌రెడ్డి సర్కారుపై ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు మండుటెండలను లెక్కచేయకుండా వారం రోజులపాటు దాదాపు 130 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్.ఎస్ మండలం రామోజీతండా, నశింపేట తదితర గ్రామాల నుంచి 25 మంది రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం కొద్ది రోజులుగా పాత ఎడ్ల బండ్లు ఉన్న వారు బాగు చేయిస్తుండగా కొంతమంది ఏకంగా కొత్త బండ్లను చేయించుకొని ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 22న ఆత్మకూర్.ఎస్ మండలం దండు మైసమ్మ తల్లి వద్ద పూజలు చేసి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎడ్ల బండ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రైతాంగానికి అన్నీ ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్‌ను చూడాలి. ఆయన చెప్పే మాటలు వినాలి. ఆయనకు మద్దతు ఇవ్వాలనే నేను వరంగల్ సభకు వెళుతున్న. ఏండ్లకు ఏండ్లు నీళ్లు చూడని మాకు కేసీఆర్ పుణ్యమా అని జగదీశ్‌రెడ్డి సారు నీళ్లు తెస్తే పుష్కలంగా పంటలు పండించాం. ఇయ్యాళ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నీళ్ల గోసను చూపిస్తున్నది.
సాగునీటికి నోచుకోని సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలను కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు అందించి మాజీ సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేశారు. దశాబ్దాలుగా నీళ్ల చుక్కకు ఎరుగక బీడుగా ఉన్న తమ భూములను బీఆర్ఎస్ పాలనలో ఇంచు భూమి వదలకుండా సాగు చేశామని రైతులు చెబుతున్నారు. ఈ మాయదారి కాంగ్రెస్ రాగానే మళ్లీ నీళ్లు బంద్ కావడంతో పంటలు ఎండిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాలతోపాటు రైతాంగాన్ని కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నారని, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లతో ఎండిన చెరువులు నింపి పంటలకు ఇబ్బంది లేకుండా చేశారని అంటున్నారు. నాడు మండు వేసవిలో చెరువులు నింపి అలుగులు పోయిస్తే కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా దొరకడం కష్టతరంగా మారిందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందనుకుంటే మళ్లీ నీళ్ల కష్టాలు వచ్చాయని, పంటలు పండక రైతులు, ప్రజలు మళ్లీ వలస పోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనే బాగుందని, మళ్లీ ఆయన వస్తేనే జనానికి ఏ ఇబ్బంది ఉండద్దనే ఉద్దేశంతో వరంగల్ సభకు ఎడ్ల బండ్లపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
పోయిన సారి ఎన్నికలప్పుడు కేసీఆర్ సారు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బేజారు కావద్దని మరీమరీ చెప్పినా ఏదో చేస్తారని ఓటు వేసినం. నమ్మి మోసం పోయినం. నీళ్లు లేక పంటలు ఎండితే జగదీశ్‌రెడ్డి సారు పరిశీలించి ధైర్యం చెప్పిండు. ఇప్పుడు కేసీఆర్ సారుకు అధికారం లేకున్నా ‘మళ్లీ మీరే వస్తారు.. మా మద్దతు మీకే’ అని చెప్పేలా ఎడ్లబండ్లపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నం. కేసీఆర్ సారు మాకు ధైర్యం చెబుతాడనే వరంగల్ వెళుతున్నాం.
ఆనాడు కేసీఆర్ సారు ఇస్తానన్నయే కాకుండా ఎన్నో పథకాలు ఇచ్చి ఆదుకుండు. అందరికీ అన్నీ ఇచ్చిండు. కానీ కేసీఆర్ కంటే అనేకం ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న రేవంత్‌రెడ్డి ఏమీ చేయక మోసం చేస్తున్నడు. ఎర్రటి ఎండల్లో ఎడ్లబండ్లపై పోయి కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరు తనాన్ని అందరికీ తెలియజేసేందుకే వరంగల్ వెళ్తున్నాం.