తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పజెప్పుతూ ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సుధాకర్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. నల్లగొండ, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సమన్వయకర్తగా నియమించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సుధాకర్ తెలంగాణ ఉద్యమంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పని చేశారు.
పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అధినేత కేసీఆర్‌తో కలిసి నడిచారు. ఉద్యమంలో మిలిటెంట్ పోరాటం చేసి పీడీ యాక్ట్ కేసులో జైలు జీవితం గడిపారు. మధ్యలో పలు కారణాలతో బయటకు వెళ్లినా తిరిగి ఇటీవలే మాతృ సంస్థ బీఆర్ఎస్లోకి వచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కానున్నట్లు చెరుకు సుధాకర్ ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పని చేయాలని, కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.