అర్వపల్లి/శాలిగౌరారం, ఏప్రిల్ 19 : కాంగ్రెస్ నాలుగు నెలల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌తో కలిసి అర్వపల్లి మండల కేంద్రం నుంచి శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బూడిద భిక్షమయ్యగౌడ్‌తో కలిసి క్యామ మల్లేశ్ యోగానంద లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోలాటాలు, డప్పుచప్పుళ్లతో అర్వపల్లి వై జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అడ్డగోలు, అమలు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ మోస పూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మి, తులం బంగారం, మహిళలకు 2500, నెలకు 4 వేల పింఛన్, రైతు భరోసా ఇప్పటికీ ఇయ్యలేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ అమలు కాలేదని, రైతు కూలీలకు 12 వేల ఊసేలేదన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి నేడు వాటిని విస్మరిస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా కనీసం ఇవ్వడానికి చేతగాని అసమర్థ ప్రభుత్వమని పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు తప్ప ప్రజలకిచ్చిన హామీలపై ఏనాడూ మాట్లాడడం లేదన్నారు. పాలన చేయమంటే తప్పించుకొని తిరుగుతున్న దద్దమ్మ రేవంత్ అని విమర్శించారు. దేశానికి, రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందని ఓటేయాలని ప్రశ్నించారు. ఓట్ల కోసం తెలంగాణ నీళ్లను ఇతర రాష్ర్టాలకు మళ్లించుకోవాలని కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలో ఏ పార్టీకి ఓటు వేసినా మోరీలో వేసినట్టే అని అన్నారు. మన ఆశలు నెరవేరాలంటే ఢిల్లీలో బీఆర్ఎస్ ఉండాల్సిందేనని చెప్పారు. ప్రతి కార్యకర్త కేసీఆర్‌లా పని చేసే బీఆర్ఎస్ అభ్యర్థి, బలహీన వర్గాల నాయకుడు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై పూర్తి వ్యతిరేకత వచ్చిందని, బీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలువబోతున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ.. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచే పార్టీ బీఆర్ఎస్ అని, పార్లమెంట్లో తెలంగాణ గలాన్ని వినిపించే బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం శాలిగౌరారంలో జరిగిన ప్రచారంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటర్ బీఆర్ఎస్కు జై కొట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఒక్కసారైనా పొలాలు ఎండిపోలేదన్నారు. తాగు, సాగునీటి కోసం ఏనాడూ ప్రజలు, రైతులు ఇబ్బందులు పడిన దాఖలాలు లేవన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరువు తాండవిస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, పార్టీ మండలాధ్యక్షులు గుండగాని సోమేశ్గౌడ్, ఐతగోని వెంకన్నగౌడ్, రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, మొరిశెట్టి ఉపేందర్, చాడ హతీష్‌రెడ్డి, గుండా శ్రీనివాస్, కట్టా వెంకట్‌రెడ్డి, మామిడి సర్వయ్య, గుజిలాల్ శేఖర్‌బాబు, కొన్రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, గంట శంకర్, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, దాసరి వెంకన్న, అక్కెనపెల్లి శ్రీరాములు, చివుట సైదులు, వేల్పుల నరేందర్, పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌రెడ్డిని ఎంపీ బొందపెట్టాలని అన్నారు. గత ఎన్నికల్లో పాలు ఇచ్చే బర్రెను అమ్ముకొని దున్నపోతును తెచ్చుకున్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో పాలన ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా రైతుబంధు, 2 లక్షల రుణమాఫీ, కల్యాణలక్ష్మి, తులం బంగారం, రూ.2500 ఏమయ్యాయని ప్రశ్నించారు. మనమంతా కలిసికట్టుగా పని చేసి భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి గులాబీ దళపతి కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని అన్నారు.
– మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ.. మీ సేవకుడిగా ముందుకు వస్తున్నాను. తనను ఆదరించి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ పిలుపునందుకొని భువనగిరి ఎంపీ అభ్యర్థిగా వచ్చానని, మీ బిడ్డగా, మీ అన్నగా, మీలో ఒకడిగా ఆశీర్వదిస్తే జీవితాంతం పని చేస్తానని తెలిపారు. తనను గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ ప్రజలకు కావాల్సిన వనరులను కొట్లాడి సాధిస్తామన్నారు. ప్రజలు గమనించి మోసకారి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు.