ఈ నెల 26వ తేదీన మునుగోడుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కోసం పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మునుగోడులోని చౌటుప్పల్ రోడ్డులో బహిరంగ సభ కోసం స్థలం ఎంపిక చేశారు. గతేడాది ఆగస్టు 20న ఉప ఎన్నికల ముందు జరిపిన స్థలంలోనే మరోసారి సభ నిర్వహించనున్నారు. సుమారు 50 వేల మందికి పైగా జనం సభకు తరలివస్తారని అంచనా వేస్తూ అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆదివారం సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక నేతలకు తగు సూచనలు చేశారు. మండలాలు, గ్రామాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి సభ విజయవంతం కోసం దిశానిర్దేశం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయడం ద్వారా ఎన్నికలకు ముందే ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసరాలని భావిస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ) : ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కావడంతో దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలన్న పట్టుదలతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు ప్రజా ఆశీర్వాద సభ అని నామకరణం చేయగా పలు బృందాలు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఐదు రోజులుగా సభా స్థలాన్ని సిద్ధ్దం చేయడంతో పాటు వేదిక నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు. సభా స్థలంతోపాటు పార్కింగ్ స్థలాలను కూడా ఎంపిక చేసి చదును చేస్తున్నారు. ఈ నెల 26న సీఎం కేసీఆర్ ముందుగా అచ్చంపేట, నాగర్‌కర్నూల్ బహిరంగసభల్లో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడుకు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో రానున్న నేపథ్యంలో సభా వేదికకు ఒక వైపున మూడెకరాల్లో హెలిప్యాడ్‌ను సిద్ధ్దం చేస్తున్నారు. హెలిప్యాడ్‌తో పాటు బందోబస్తు ఏర్పాట్లును జిల్లా ఎస్పీ అపూర్వరావు పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి సభికులకు ఇబ్బంది లేకుండా నేరుగా సభావేదికకు కేసీఆర్ చేరుకునేలా ప్రత్యేకంగా రహదారిని ఏర్పాటు చేస్తున్నారు.
గతేడాది కాలంలోనే అనేక అభివృద్ధ్ది పనులకు మునుగోడులో శ్రీకారం చుట్టారు.సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి, మర్రిగూడలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, బీటీరోడ్లు, ఆర్అండ్బీ రోడ్లు, సోలిపురం బ్రిడ్జి, చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో రూ.75 కోట్లతో రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, నారాయణపురం, గట్టుప్పల్, తేరటుపల్లిల్లో చేనేత క్లస్టర్ల ఏర్పాటు, నారాయణపురంలో గిరిజన భవనం, గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు, తండాల్లో ప్రత్యేకంగా రూ.25కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి పనులు ఈ ఏడాది కాలంలోనే శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే మునుగోడులో ఫ్లోరైడ్‌ను పారదోలిన ఘనత బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. శాశ్వత పరిష్కారం దిశగా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడెం, లక్ష్మాణపురం రిజర్వాయర్ల నిర్మాణాలు 70శాతం పూర్తి చేసింది. వీటన్నింటి నేపథ్యంలో మునుగోడులో జరుగనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగసభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సభకు విస్తృత ప్రచారం కల్పిస్తూ మండలాల వారీగా పార్టీ నేతలంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ శ్రేణులతో మమేకం అయ్యారు. పార్టీ శ్రేణులను సన్నద్ధ్దం చేయడంతో పాటు సామాన్య జనం సభకు వచ్చేలా చూస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా మునుగోడు అభివృద్ధ్ది టీఆర్ఎస్తోనే ముడిపడి ఉందని, మునుగోడు గడ్డ బీఆర్ఎస్ అడ్డ అని చాటి చెప్పేందుకు పార్టీ యావత్తు పనిచేస్తున్నది.
అందువల్లనే సీఎం కేసీఆర్ సభకు ప్రతీ ఊరువాడా నుంచి జనం తరలివచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలోనూ భారీగా జనం తరలివచ్చేలా పరిస్థితులు కనిపిస్తుండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తమ సొంత వాహనాలపై తరలివచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారు. చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడెంలతో పాటు గట్టుప్పల్ మండలాల వారు కొంపల్లి వైపు నుంచి, నాంపల్లి, చండూరు మండలాల వారు చండూరు రూట్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వివరించారు. అభివృద్ధ్ది ప్రదాత కేసీఆర్‌కు ఘనస్వాగతం తెలపడంతో పాటు సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
మునుగోడు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 26న మునుగోడులో జరిగే ప్రజా ఆశ్వీరాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సభస్థలాన్ని ఆదివారం పరిశీలించి పలు సూచనలు చేశారు. చౌటుప్పుల్ రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయంలో సమీపంలో సభ నిర్వహణకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. సభకు జననేత మునుగోడుకు వస్తుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, బీఆర్ ఎస్ నాయకులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పందుల పవిత్రాశ్రీను, బీసం మల్లేశ్, కొమ్ము కృష్ణయ్య, మహ్మద్ వాజీద్, పెరుమాళ్ల ప్రణయ్ కుమార్, దోటి కరుణాకర్,ఐతగోని విజయ్, దుబ్బ రవి, వనం సురేశ్, నకిరేకంటి వెంకన్న, గాలిబాబు ఉన్నారు.
ఇక బహిరంగసభకు 50వేల మందికి పైగా తరలివచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో అందుకు అనుగుణంగా సభా స్థలాన్ని ఎంపిక చేశారు. దీన్నంతటిని ఇప్పటికే చదును చేసి సిద్ధం చేశారు. ఈ స్థలంలో భారి కేడ్లు, ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సభా వేదిక స్థలం, సభకు వచ్చే వారు కూర్చునే స్థలం, లోపలికి సులువుగా ప్రవేశించేలా దారులు ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా సభకు వచ్చే వాహనాలను సైతం ఎక్కడికక్కడే పార్క్ చేసే విధంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాట్లు చేశారు.
మునుగోడుకు మూడు వైపులా విశాలమైన ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేశారు. వీటిని కూడా ఇప్పటికే చదును చేసి సిద్ధం చేశారు. ఎటు వైపు నుంచి వచ్చే వాహనాలు ఆ వైపే నిలిపి అక్కడి నుంచి ప్రజలకు సభాస్థలికి చేరుకునేలా జగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సభకు హాజరయ్యే జనానికి కూడా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నికల అనంతరం జరుగుతున్న మరో ఎన్నికల సభ కావడంతో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది ఆగస్టులో అప్పటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభివృద్ధ్ది పేరుతో తన పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జరిగింది.
ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి తన వ్యక్తిగత అవసరాల రీత్యా కాంగ్రెస్ నుంచి కాకుండా బీజేపీ నుంచి బరిలోకి దిగారు. పైకి అభివృద్ధ్ది పేరు చెప్పగా లోపల తన వ్యాపార ఆర్థ్ధిక అవసరాల కోసమే ఉప ఎన్నిక తెచ్చిపెట్టారని భావించిన మునుగోడు ప్రజలు ఆయనకు ఊహించని షాక్ ఇస్తూ తీర్పును ఇచ్చారు. మునుగోడు అభివృద్ధి బీఆర్ఎస్తోనే ముడిపడి ఉందని స్పష్టం చేస్తూ ప్రజలు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకున్నారు. 2014 నుంచి 2018వరకు బీఆర్ఎస్లో జరిగిన అభివృద్ధ్ది తప్పా 2018లో రాజగోపాల్‌రెడ్డి గెలిచి. ఉప ఎన్నిక వచ్చే వరకు జరిగిన అభివృద్ధి ఇక్కడ శూన్యం. దాంతో ఉప ఎన్నికల్లో మునుగోడు అభివృద్ధిని కాంక్షిస్తూ బీఆర్ఎస్కు పట్టం కట్టారు.