రామగిరి, సెప్టెంబర్ 20 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి అపూర్వమైన స్పందన వస్తుందని, వారి కోరిక మేరకు అడ్మిషన్ల ప్రక్రియ గడువు ఈ నెల 26వ తేదీ వరకు పెంచడం జరిగిందని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ తెలిపారు. నల్లగొండలోని యూనివర్సిటీ రీజినల్ సెంటర్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టైఫండ్ ఆధారిత విద్యా కార్యక్రమం (STEP) ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను అప్రెంటిస్షిప్ ల చదువుతో పాటు, గ్రామీణ గిరిజన విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను కూడా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ ద్వారా ప్రతి సంవత్సరం 5 వేల మంది గ్రామీణ గిరిజన విద్యార్థులకు ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
అంతేకాకుండా తెలంగాణలోని గోండు కోయ, చెంచు ఆదివాసులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల దూర విద్య కో ఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్, కౌన్సిలర్లు, పున్న అంజయ్య, శ్రీకాంత్, మహేష్ పాల్గొన్నారు.