నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్14 (నమస్తే తెలంగాణ) : కొద్ది రోజులుగా నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని బీసీల కోసం త్యాగం చేస్తానని చెబుతూ వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాలుక మడతేశారు. నల్లగొండ నుంచి తానే పోటీ చేస్తానని, భారీ మెజార్టీతో గెలిపించాలంటూ తాజాగా చేసిన ప్రకటన బీసీ వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. దాంతో నల్లగొండలో వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీలకే టికెట్ అంటూ మభ్య పెట్టి తన అసలునైజాన్ని బయటపెట్టుకున్న వెంకట్‌రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరుపై నల్లగొండ నియోజకవర్గంలోని బీసీ వర్గాలు కన్నెర చేస్తున్నారు. ఎవరూ డిమాండ్ చేయకముందే ఇటీవల నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని బీసీల కోసం త్యాగం చేస్తానని స్వయంగా వెంకట్‌రెడ్డి ప్రకటించారు. పలుమార్లు ఇదే ప్రకటన చేస్తూ బీసీ వర్గాల్లో ఆశలు రేపారు. కాంగ్రెస్ పార్టీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ స్థానంలో రెండు అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించాల్సి ఉంది. దీనిని గుర్తు చేస్తూ నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలో నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని బీసీలకు ఇస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటన చేశారు. నిజమే అనుకున్న కాంగ్రెస్ పార్టీలోని పలువురు బీసీ నేతలు టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలోనూ పలువురు టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నారు.
పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌తో పాటు పలువురు బీసీ నేతలక వెంకట్‌రెడ్డి స్వయంగా ఫోన్ చేసి నల్లగొండ నుంచి ఈ సారి తాను పోటీ చేయనని.. మీరు పోటీకి రెడీ కావాలంటూ చెప్పినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. నిజమే అనుకున్న ఒకరిద్దరూ బీసీ నేతలు పోటీకి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నట్లు తెలిసింది. కానీ వెంకట్‌రెడ్డిని ఫస్ట్ నుంచి గమనిస్తున్న బీసీ నేతలు కొందరూ ముందే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. మాయమాటలు చెప్పి, మభ్య పెట్టడం వెంకట్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య… బీసీలకు దగ్గరయ్యేందుకే ఈ పాచిక అంటూ కొట్టిపడేస్తూ వచ్చారు. వాస్తవంగా కొంత కాలంగా నల్లగొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో వెంకట్‌రెడ్డికి గ్యాప్ పెరిగింది. ఇటీవల నిరుద్యోగ దీక్ష సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్లాక్‌టవర్ సెంటర్లో మీటింగ్‌కు వస్తే వేదిక మీదికి బీసీ నేతలు రాకుండా వెంకట్‌రెడ్డి అడ్డుకున్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడైన చెరుకు సుధాకర్‌తో పాటు కొందరు నేతలను వేదిక మీదికి రాకుండా అడ్డుకొని వాళ్ల పేర్లను కూడా ప్రస్తావించకుండా అవమానించారు.
ఆ తర్వాత భట్టీ విక్రమార్క పాదయాత్రలోనూ ఇదే విధంగా వ్యవహరించారు. పైగా చెరుకు సుధాకర్‌ను చంపేస్తామంటూ ఆయన కొడుకు సుహాస్‌ను ఫోన్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించిన ఆడియో బీసీ వర్గాల్లో కలకలం రేపింది. వీటితో పాటు పలు సందర్భాల్లో వెంకట్‌రెడ్డి వ్యవహారశైలితో బీసీ నేతలు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి పరిణామాలతో వెంకట్‌రెడ్డికి, పార్టీలోని బీసీ వర్గాలకు తీవ్ర అగాథం నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల తరుణంలో ఈ గ్యాప్‌ను సరిదిద్దుకునే క్రమంలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీసీ కార్డు ముందరేసారన్న చర్చ సర్వత్రా నెలకొంది. బీసీల కోసం తన టికెట్ త్యాగం చేస్తున్నట్లు ప్రకటించిన రోజునే ఇందులో ఏదో మాయ ఉంటుందని అనుమానించారు. అనుమానించినట్లుగానే బీసీ కార్డు ఉత్తదేనని, తానే అభ్యర్థినంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన అసలు నైజాన్ని ప్రదర్శించారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన బూత్‌కమిటీల సమావేశంలో తానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాంతో బీసీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మభ్య పెట్టి మోసం చేసిన వెంకట్‌రెడ్డి ఎన్నికల్లో బుద్ధి చెబుతామంటున్నారు.
నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ బీసీల కోసం త్యాగం చేస్తానని చెప్పి, మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీసీ విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకట్‌రెడ్డి మోసపూరిత వైఖరిని నిరసిస్తూ గురువారం నల్లగొండ పట్టణంలోని గడియారం చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీ ద్రోహీ అంటూ కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్‌గౌడ్ మాట్లాడుతూ నల్లగొండ నియోజక వర్గాన్ని బీసీలకోసం త్యాగం చేస్తానని చెప్పి వెంకటరెడ్డి మభ్యపెట్టాడన్నారు.
ఆయనకు ఏనాడు బీసీలపై ప్రేమ లేదన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో గాని జిల్లాలో గానీ కాంగ్రెస్ పార్టీలో ఏనాడు కూడా ఎమ్మెల్యే స్థాయికి బీసీలను ఎదుగనియ్యలేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ది నల్లగొండ జిల్లాలో బీసీలను అణిచివేసిన చరిత్రే కానీ ఎదుగనిచ్చినది కాదన్నారు. నకిరేకల్ లాంటి ఎస్సీ రిజర్వు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున టికెట్ ఇప్పిస్తానని అనేక మంది వద్ద కోట్ల రూపాయలు దండుకున్న దుర్మార్గుడని ఆరోపించారు. వెంకటరెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నల్లగొండ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిసి అతడిని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగు నరేశ్‌గౌడ్, యాదగిరి యాదవ్, రామన్న గౌడ్, లక్ష్మణ్ యాదవ్, ఉపేందర్ యాదవ్, మహేశ్‌కుమార్, పృద్వీ, శేఖర్, సాయికుమార్, విగ్నేశ్గౌడ్, చింటూ, రమేశ్‌యాదవ్, లింగస్వామి, ఊరుపక సాయి, బొంత రమేశ్, చాకలి అంజి పాల్గొన్నారు.