యాదాద్రి భువనగిరి అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ)/రామన్నపేట ; ‘భారీ పోలీస్ బందోబస్తు.. నిరసనలు.. గో బ్యాక్ అంబుజా.. గో బ్యాక్ అంటూ నినాదాలు.. అడ్డగింతలు.. ఆందోళనలు.. ఉద్రిక్త పరిస్థితులు’ ఇవీ రామన్నపేట అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణలో చోటుచేసుకున్న ఘటనలు. రామన్నపేట శివారులో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఆద్యంతం ఉతంఠగా కొనసాగింది. ఇక రామన్నపేటకు రాకుండా బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయాలని సదరు సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. రామన్నపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో అదానీ భూముల్లో షెడ్డు వేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. దీనికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్, పీసీబీ ఈఈ సంగీత, ఆర్డీఓ శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సంస్థ కన్సల్టెంట్ సుబ్బ లక్ష్మణ్ భాసరన్ ప్రాజెక్టు గురించి వివరించారు.
ఆందోళనతో షురూ..
ప్రజాభిప్రాయ సేకరణ భాగంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రారంభం నుంచే ఆయా గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో సభా స్థలికి చేరుకున్నారు. అయితే ప్రజాప్రాయ సేకరణకు ఫేక్ ఎన్జీఓలు, ఏపీ నుంచి మహిళలు వచ్చారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ఎన్జీఓలను అనుమతించవద్దని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నల్లజెండాలు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అకడే బైఠాయించి ధర్నా నిర్వహించారు. కంపెనీకి వ్యతిరేక నినాదాలు చేశారు. ఇదే సమయంలో సదరు ఎన్జీఓస్ను హాజరు కాకుండా అడ్డుకున్నారు. పలువురు ప్రతినిధులను అకడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు.
ముక్తకంఠంతో వ్యతిరేకించిన ప్రజలు
ప్రజాభిప్రాయ సేకరణలో అంబుజా సిమెంట్ ఏర్పాటు ప్రతిపాదనను ఆయా గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, హాజరై నిరసన తెలిపారు. ప్రజా ప్రతినిధులు, స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు వేర్వేరుగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశ్రమ స్థాపనను అంగీకరించలేదని కుండబద్ధలు కొట్టారు. డ్రైపోర్ట్ పేరుతో భూములను కొనుగోలు చేసి, ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే ఎలా ఊరుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల జరిగే పరిణామాలను కొందరు ప్రజాప్రతినిధులు వివరించే ప్రయత్నం చేశారు. పర్యావరణ పరిరక్షణ వేదిక ప్రతినిధి రేహాన్ తన అభిప్రాయం తెలియజేసి, అంబుజా సిమెంట్ కంపెనీ నివేదిక కాపీలను వేదికపైనే చింపేసి నిరసన వ్యక్తం చేశారు.
ఇక అందరి అభిప్రాయాన్ని అధికారులు రికార్డ్ చేసుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంలో ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. గో బ్యాక్ అంబుజా- గో బ్యాక్ అదానీ, ప్రాణాలైనా అర్పిస్తాం.. అంబుజాను ఆపేస్తాం.. అంబుజా వద్దురా -రామన్నపేట ముద్దురా.. అంటూ పెద్ద ఎత్తున నినదించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం సేకరించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని, ప్రజాభిప్రాయ సేకరణను ముగిస్తున్నామని అధికారులుతెలిపారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. కాగా దీనికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరు కాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరై రామన్నపేట ప్రజలకు మద్దతుగా, పరిశ్రమ ఏర్పాటు చేయాలని తన వాయిస్‌ను వినిపించారు.
పలు దఫాలుగా అధికారుల అడ్డగింత..
వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునే క్రమంలో అధికారులను స్థానికులు పలు దఫాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిందని అధికారులు ప్రకటించడంతో స్థానికులు ఒకసారిగా కోపోద్రిక్తులయ్యారు. కొందరు స్టేజీ పైకి వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే వెళ్లిన పలువురు అడిషనల్ కలెక్టర్‌ను ప్రశ్నించారు. అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక అధికారులు బయటకు వచ్చే సమయంలోనూ పెద్ద ఎత్తున వెంబడించారు. కారులో వెళ్తుండగా వాహనానికి నాలుగు వైపులా కార్నర్ చేసి నిలువరించారు. ప్రజాభిప్రాయ సందర్భంగా జనాలకు ఏదీ చెప్పకుండా వెళ్లొద్దని నినదించారు. దీంతో వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు..అందరినీ చెల్లాచెదురు చేయడంతో అధికారులు వెళ్లిపోయారు.
రామన్నపేట స్వచ్ఛంద బంద్
అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా బుధవారం రామన్నపేటలో బంద్ పాటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అంబుజా సిమెంట్ కంపెనీ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
భారీ పోలీస్ బందోబస్తు
ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయని భావించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. స్థానిక పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగింది. వందల మంది పోలీసులు విధులు నిర్వహించారు. ప్రారంభంలో గేటు మొదలుకొని సభాస్థలి లోపలికి చేరుకునే వరకు ప్రతి ఒకరిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. రామన్నపేట మండలానికి చెందిన వారిని మాత్రమే అనుమతించారు.