సూర్యాపేట టౌన్ : ఈనె ల 27న ఉమ్మడి వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వరంగల్ సభ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా లక్షలాదిమందితో నిర్వహించనున్న ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యచరణకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.
ప్రతి గ్రామము నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యమై సభలో పాల్గొనేలా నాయకులు కృషి చేయాలన్నారు. గతంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని చరిత్ర బీఆర్ఎస్కు ఉందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రం రేవంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్లడంతో ప్రజావ్యతిరేక పాలన సాగుతుందన్నారు. ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఉప్పల ఆనంద్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జెడ్పిటిసి జిడి భిక్షం, నాయకులు ఉప్పల సైదులు, బుడిగ నవీన్ తదితరులు ఉన్నారు.