అర్వపల్లి, జూన్ 18 : పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు భూక్య నగేశ్నాయక్ సిబ్బందికి సూచించారు. నీళ్ల విరేచనాల నియంత్రణపై మండల స్థాయి అధికారుల టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి 0 నుండి 5 సంవత్సరాల మధ్య పిల్లలు ఎవరైనా డైయేరియా బారిన పడితే వారిని గుర్తించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. అలాగే తల్లి పాల ప్రాముఖ్యత గురించి ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీకాంత్, మండల అభివృద్ధి అధికారి గోపి, మండల విద్యాధికారి బాలు నాయక్, సీహెచ్ఓ మాలోతు బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ అనిత పాల్గొన్నారు.