ఆత్మకూర్.ఎస్, మార్చి 28 : పొట్టకూటి కోసం ఇటుక బట్టీలో పని చేసేందుకు వచ్చిన బాలికపై మద్యం మత్తులో ఇటుక బట్టి యజమాని లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేట శివారులోని వెంగమాంబ బాలాజీ హాలో బ్రిక్స్ వద్ద జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం వెంగమాంబ బాలాజీ ఇటుక బట్టి యజమాని గోగినేని వెంకటరమణ మద్యం మత్తులో తన బట్టిలో పని చేస్తున్న 15 ఏండ్ల బాలికను స్వీట్ ఇస్తానని తన రూమ్‌కు పిలిచాడు. బాలిక రూములోకి వచ్చిన వెంటనే తలుపు పెట్టి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక భయంతో బయటకు వచ్చి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారికి ఏదో రకంగా నచ్చచెప్పేందుకు ఇటుక బట్టి యజమాని ప్రయత్నించాడు. గురువారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు ఆత్మకూర్.ఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారించాడు. ఈ మేరకు వెంకటరమణపై పొక్సో, లేబర్ యాక్ట్, జువైనల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. శుక్రవారం ఉదయం బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించి లైంగిక దాడి సంఘటనపై వాంగ్మూలం తీసుకొని రికార్డును న్యాయమూర్తి ముందు సమర్పించనున్నట్లు తెలిపారు. నిందితుడు వెంకటరమణను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన గోగినేని వెంకటరమణ వ్యాపారాల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. డబ్బు, పలుకుబడితో అధికారులను మచ్చిక చేసుకొని తన తప్పులను కప్పి పుచ్చుకుంటున్నాడని విమర్శలున్నాయి.