– 1వ తరగతి విద్యార్ధిని తలపై కొట్టిన టీచర్
– పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు
రామగిరి, జూలై 03 : చిన్నారులకు మంచి ప్రవర్తన అలవర్చడంతో పాటు పాఠశాలలో ఉత్తమ వాతావరణం కల్పించి విద్య పట్ల భయం తొలిగేలా చూడాలి కాని నల్లగొండ జిల్లా కేంద్రంలోని కార్పోరేట్ విద్య సంస్థ ‘నారాయణ హై స్కూల్’లో 1వ తరగతి విద్యార్ధి శ్రేయన్స్ను టీచర్ విచక్షణ రహితంగా తల, ముఖంపై కొట్టడంతో బొడిపె వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అసలే బాబు ఆరోగ్యం సక్రమంగా లేదని ఇలా కొట్టడంతో పాఠశాల అంటే భయపడిపోతున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే విషయంపై పాఠశాల యాజమన్యం వద్దకు వెళ్తే నిర్లక్ష్యంగా వ్యహరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. అనంతరం నల్లగొండ టౌన్ పోలీసు స్టేషన్లో పాఠశాలపై ఫిర్యాదు చేశారు. డీఈఓ, ఎంఈఓతో పాటు విద్యాశాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేయక పోవడంతోనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నట్లు పలువురు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.