హుజూర్నగర్, సెప్టెంబర్ 14 : హుజూర్‌నగర్‌లో ఈ నెల 15, 16, 19 తేదీల్లో నిర్వహించే ముత్యాలమ్మ జాతరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. యేటా శ్రావణ మాసంలో మూడ్రోజులపాటు ఘనంగా నిర్వహించే ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రత్యేక స్థానముంది. తొలి రోజు ఆదివారం పట్టణంలోని ఊర చెరువు వద్ద ఉన్న పోంచర్ల ముత్యాలమ్మకు, రెండో రోజు సోమవారం పోచమ్మ తల్లికి, గురువారం కనకదుర్గమ్మ జాతర నిర్వహిస్తారు.
మహిళలు బోనాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవార్లకు చీర, సారెలను భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. రైతులు ట్రాక్టర్లకు ప్రభలు కట్టి మేళతాళాలతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. జాతరను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి కోళ్లు, మేకలు బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. యాదవుల సంప్రదాయ నృత్యాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రతి ఇంటికీ బంధువుల రాకతో హుజూర్నగర్ పట్టణంలో శనివారం సాయంత్రం నుంచే సందడి సంతరించుకోనుంది.
ఆదివారం జాతర ప్రారంభం కానుండగా.. ఆలయాలను ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది మురుగు కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పారిశుధ్య నిర్వహణను మున్సిపల్ కమిషనర్ యాకుబ్ పాషా పరిశీలించారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
సుమారు 2లక్షల మంది భక్తులు వచ్చే అవకాశమున్న ఈ జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆరుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.