నీలగిరి, మార్చి15 : పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మూడు రోజులుగా నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ అద్వర్యంలో నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ ముగింపు కార్యక్రమం జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపోందిన విజేతలను మంత్రి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రల కోసం అహర్శిలు కృషి చేస్తున్న పోలీస్ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు.
పోలీస్ శాఖ అంటే నిత్యం ఒత్తిడితో కూడిన ఉద్యోగమని ఆ ఒత్తిడిని జయించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు. డ్రగ్స్ బారిన పడి యువత తమ జీవితాన్ని, భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలు నిలిపేలా యువత పనిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ కోసం తొలిసారిగా జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మౌలిక సదుపాయలతో పాటు నూతన డీఎస్పీ కార్యాలయం క్వార్టర్స్ నిర్మాణం నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే కాకముందు నల్లగొండలో చాలా మత ఘర్షణలు జరిగేవని, అంతేగాకుండా దేశంలో ఎక్కడ ఏచిన్న సంఘటన జరిగిన నల్లగొండతో ముడిపడి ఉండేదన్నారు. వాటిన్నింటిని తొలగించుకుని ముందుకు సాగుతున్నామని, ప్రస్తుతం రంజాన్ మాసం జరుగుతున్నందున అందరూ సోదరభావంతో కలిసిమెలసి ఉండి నల్లగొండను రోల్ మోడల్‌గా తయారు చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. గెలుపు ఓటములు అనేవి సహజమని, గెలిచిన వారు ఓడిన వారు క్రీడాస్ఫూర్తితో ముందుకు పోవాలన్నారు. క్రీడల్లో వచ్చే అనుభవాలు నిత్యం ఉద్యోగ నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడల్లో సుమారు 600 మంది ఉద్యోగులు పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం ఆటల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రమేశ్, కొలను శివరాంరెడ్డి, రాజశేఖర్‌రాజు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
Minister Komatireddy Venkatreddy : పోలీస్ శాఖకు అన్ని విధాలా సహకారం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి