రామగిరి, ఫిబ్రవరి 7: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా మూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్ నుంచి డీఈఓ కార్యాలయం దగ్గరి అంబేద్కర్ విగ్రహం సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకున్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, టీపీటీఎఫ్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, దుర్గభావాని, పాలకుర్తి కృష్ణమూర్తితో కలిసి నర్సిరెడ్డి నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు. అనంతరం మిర్యాలగూడ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా రంగ పరిరక్షణ కోసం, పేద పిల్లలకు సమానమైన, నాణ్యమైన విద్య అందడానికి శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకను గెలిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలమకమన్నారు.
ఉపాధ్యాయులు, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం ఆరేళ్లుగా శాసన మండలిలో ఎంతో నేను పోరాటం చేశానన్నారు. సీపీఎస్ విధానం రద్దు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్లు, గురుకుల ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరాడతానని తెలిపారు. ఉపాధ్యాయులంతా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తనను గెలిపించాలని కోరారు. తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ సంఘాల చైర్మన్ మామిడి నారాయణ, ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, టీపీటీఎఫ్ రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి ఎం.తిరుపతి, నల్లగొండ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బక్కా శ్రీనివాసాచారి, పెరుమాళ్ల వెంకటేశం, నలపరాజు వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, నాగమణి, రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షుడు జంగయ్య పాల్గొన్నారు.
ఐదో రోజు 13 మంది నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ ఉపాధ్యాయ శాసనమండలి నియోజవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం 13 మంది అభ్యర్థులు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠికి నామినేషన్లు అందజేశారు. ఐదు రోజుల్లో మొత్తం 19 మంది అభ్యర్థ్ధులు 23 సెట్లు దాఖలు చేశారు. శుక్రవారం టీఎస్యూటీఎఫ్తోపాటు ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి నామినేషన్ వేశారు. బీజేపీ బలపర్చిన పులి సరోత్తమ్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మాజీ డీఈఓ ఏలే చంద్రమోహన్, పింగిళి శ్రీపాల్‌రెడ్డి, సుందర్రాజు, దామెర బాబురావు, పూల రవీందర్, తలకోల పురుషోత్తంరెడ్డి, పులిపాక వెంకటస్వామి, చాలిక చంద్రశేఖర్, కంటే సాయన్న, జంగిటి కైలాసం, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు.