కోదాడ, డిసెంబర్ 1 : కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పేరుతో పలుచోట్ల శంకుస్థాపనలు చేసింది. నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కానీ నిధులు విడుదల కాలేదు.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దాంతో ఖాళీ శిలాఫలాలు వెక్కిరిస్తున్నట్లు దర్శనమిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నది. 11 నెలలుగా హామీలు అమలు చేయకుండా, అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు.
కోదాడ నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.800 కోట్లకు పైగా నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి ప్రకటించారు. వాటికి సంబంధించిన పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఇప్పటికే మూడు విడుతలు వివిధ విభాగాల అధికారులతో మంత్రి, ఎమ్మెల్యే సమీక్షలు కూడా నిర్వహించారు. కానీ పనులు మాత్రం సంవత్సరం కావస్తున్నా జరుగడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ బీటీ రోడ్లకు మట్టిపోయడం తప్ప ఆశించిన స్థాయిలో పనులు కొనసాగడం లేదని ఉత్తమ్ దంపతులు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు
ఆయకట్టు చివరి ప్రాంతంలో రైతులకు సాగునీరు అందించేందుకు గత మార్చిలో రూ.25 కోట్లతో చేపట్టిన రెడ్లకుంట ఎత్తిపోతల పనులకు ఇప్పటికి తట్టెడు మట్టి కూడా పోయలేదు. ఇప్పటికే నియోజకవర్గంలో శిథిలావస్థలో ఏడు ఎత్తిపోతల పథకాలు, నాలుగు పనిచేయని ఎత్తిపోతల పథకాలతో రైతులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా రెడ్లకుంట ఎత్తిపోతల పథకానికి తక్షణమే నిధులు మంజూరు చేసి అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
లబ్ధిదారులకు అందని ఇండ్లు
గత ప్రభుత్వం రూ.40 కోట్లతో కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో 560 డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇండ్లు వినియోగంలోకి రావడం లేదు. రూ.80 లక్షలతో వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించాల్సి ఉంది.
శిలాఫలకాలకే పరిమితమైన మరికొన్ని పనులు
కోదాడ పెద్ద చెరువు కట్టను రూ.8 కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌గా మారుస్తున్నామని ఎమ్మెల్యే పద్మావతి 9 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఆ చెరువు కట్టపై ప్రస్తుతం ఇరువైపులా ఏపుగా పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నది. ఇక రూ.80 కోట్లతో నూతన రహదారులకు నిధులు మంజూరు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు నామా మాత్రంగానే జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోదాడలోని రోడ్లు, భవనాల అతిథి గృహానికి రూ.4కోట్లు మంజూరు చేసినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అనే చందంగా ఉంది.
సంక్షేమ పథకాలలోనూ అదే దుస్థితి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడం, రైతుబంధును బంద్ చేయడం, ఆసరా పింఛన్లు పెంచకపోవడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతి అయిన మహిళలకు రూ.10 వేలతోపాటు కేసీఆర్ కిట్టును అందించకపోవడం వంటివాటిపై ప్రజలు విమర్శిస్తున్నారు.
వంద రోజుల్లో నిర్మిస్తామన్న వంద పడకల దవాఖాన
అధికారంలోకి రాగానే వంద రోజుల్లో కోదాడ ప్రభుత్వ దవాఖానను వంద పడకలకు పెంచుతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోదాడ 30 పడకల దవాఖానను వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ జీఓ విడుదల చేయటంతోపాటు రూ.29 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరిలో మంత్రులు రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంద పడకల దవాఖాన నిర్మాణానికి శిలాఫలకం వేశారు. అది వేసి సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు పనులు షురూ కాలేదు. వంద పడకల దవాఖాన దేవుడెరుగు.. 16 మంది వైద్యులు విధులు నిర్వహించాల్సి ఉండగా నలుగురు మాత్రమే ఉన్నారు. కనీసం ప్రసూతి వైద్యురాలు కూడా లేకపోవడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సి వస్తున్నది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి. కోదాడ నియోజకవర్గంలో చేపట్టిన పనులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి వెంటనే పూర్తి చేయాలి. ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సౌకర్యాలను పెంచి రోగులు, గర్భిణులకు ఇబ్బంది లేకుండా చూడాలి. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించి లబ్ధిదారులకు అప్పగించాలి.
-భాగ్యమ్మ, మహిళా నాయకురాలు, కోదాడ