ఆత్మకూర్.ఎస్, జూలై 16 : ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ భీమ్‌సింగ్ అన్నారు. బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కశాశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రణాళికాయుతంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. రోజూ కళాశాలకు విద్యార్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని అధ్యాపకులకు సూచించారు. ఇప్పటి వరకు వచ్చిన అడ్మిషన్లకు, ఇంకా ఇంకా 15 రోజుల్లో వచ్చే అడ్మిషన్లకు సంబంధించి టీసీలను ఆయా పాఠశాలల నుంచి తెప్పించుకోవాలన్నారు.
ఈ నెలలో అడ్మిషన్లు పెంచే బాధ్యతలను అధ్యాపకులు సమిష్టిగా తీసుకుని బాధ్యతతో వ్యవహరించాలన్నారు. టీసీలు లేకుండా అడ్మిషన్లు చెల్లవన్నారు. ఈ నెల 31వరకు టీసీలు తెప్పించాలన్నారు. లేని పక్షంలో అడ్మిషన్లు డిలీట్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మారం హరిప్రసాద్, అధ్యాపకుడు గునిగంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.