మిర్యాలగూడ, మే 16 : విధులకు గైర్హాజరయ్యే వైద్యులపై చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో పర్యటించి వైద్య సేవలను పరిశీలించారు. ఆనంతరం రికార్డులను తనిఖీ చేసి వైద్యులు, స్టాఫ్ నర్సులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలను విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, వైద్యులు విధులకు రాకుండా డ్యూటీ సమయంలో తమ సొంత ఆస్పత్రిలో పని చేస్తున్నట్లు గుర్తించినట్లయితే వారి ఆస్పత్రిని మూసి వేయించడంతో పాటు కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆస్పత్రిలో త్వరలోనే బయోమెట్రిక్ హాజరు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో కాన్పుల సంఖ్య తగ్గడంపై గైనకాలజిస్టులను వివరణ కోరారు. డెలివరీల్లో 70 శాతానికి పైగా సిజేరియన్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ఆస్పత్రికి వచ్చే గర్భిణీలకు ఇబ్బందులు కలుగకుండా గైనకాలజిస్టులు అందుబాటులో ఉండాలని, సాధారణ కాన్పుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రోగులకు అందించే భోజనం మెనూను రోగుల వార్డుల్లో ఏర్పాటు చేయించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఆస్పత్రుల సమన్వయ ఆధికారి మాతృనాయక్, ఆర్ఎంఓ రాంబాబు ఉన్నారు.