నల్లగొండ, ఆగస్టు 01 : లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంలో నేత్రదానాలు చేసిన 157 మందికి, అలాగే శరీర దాతలు నలుగురికి ఘన నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం నల్లగొండ పట్టణంలోని లయన్స్ భవన్లో జరిగిన కార్యక్రమానికి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ కె వి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేత్ర దానం అంటే మరణానంతరం ఇతరులకు కంటి చూపును అందించే ఒక గొప్ప దానం అన్నారు. ఇది కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపును ప్రసాదించడానికి ఒక మార్గం అని తెలిపారు.
తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిలో ఒకరి మదిలో వచ్చిన ఆలోచన నేత్రదానం. నేత్రదానంతో ఇద్దరు కార్నియల్ అంధులకు కంటి చూపు రావటమే కాకుండా రెండు కుటుంబాల్లో సంతోషం నిండుతుంది. మానవతా విలువలతో కూడిన ఆలోచనతో ముందుకు వచ్చి నేత్రదానం చేయించాలని కుటుంబ సభ్యులంతా నిర్ణయించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించి నేత్రదానం చేయిస్తున్నట్లు తెలిపారు. 2024 ఆగస్టు 1వ తేదీన నాగరాజు అనే వ్యక్తి స్వర్గస్తులైన సమాచారంతో వారి కుటుంబ సభ్యులను సంప్రదించి, నేత్రదానం చేయించినట్లు చెప్పారు. ఇది ఇలాగే కొనసాగుతూ ఇప్పటివరకు 157 మంది నుండి 314 కార్నియా కంటి పొరలను సేకరించి 314 మంది కార్నియల్ అంధులకు కంటిచూపును అందించగలిగినట్లు తెలిపారు.
మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి మాట్లాడుతూ.. నేత్రదానం చేయించే క్రమంలో 4 కుటుంబాల వారు తమ ప్రియమైన వారి శరీరాన్ని కూడా దానం చేస్తామని తెలుపగా, నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అందించినట్లు చెపపారు. శరీర దానం అంటే మరణానంతరం వైద్య పరిశోధన, విద్య కోసం మొత్తం శరీరాన్ని దానం చేయడం అన్నారు. ఇది మెడికల్ విద్యార్థులకు శాస్త్ర పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని, వారి మనోధైర్యానికి ధన్యవాదాలు తెలిపారు.
మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించాలని, పార్థీవ దేహం ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 12 నుంచి 15 గంటలలోగా నేత్రదానం చేయించవచ్చని మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగానికి నమస్సుమాంజలి అర్పిస్తున్నామని సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ అన్నారు. నేత్రదాన మహా ఉద్యమానికి డాక్టర్ల అసోసియేషన్ పూర్తి మద్దతు తెలుపుతుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్ యాదయ్య, సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. కో ఆర్డినేటర్ శ్రీమతి కోట సరిత మాట్లాడుతూ నేత్రదానం, అవయవదానం గూర్చి ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతా పూర్వక సన్మానాలు చేశారు. నేత్రదాతలకు, పార్థివ దేహ దాతలకు నివాళులు అర్పిస్తూ, మరణం తర్వాత కూడా మరొకరికి సహాయ పడిన వీరంతా ధన్యజీవులని, వీళ్లంతా కులం, మతం, ప్రాంత భేదాలు లేకుండా స్వర్గంలో ఉంటారని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. నేత్రదానంపై మరింత సమాచారం కోసం తమ ఫోన్ నంబర్లు 9640807775 లేదా 9948143299 సంప్రదించాలని ట్రస్ట్ ట్రెజరర్ జి.లింగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు, డాక్టర్ వీర్లపాటి ప్రనూష, ఐ డొనేషన్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల, టెక్నిషియన్ జానీ పాల్గొన్నారు.
Nalgonda : శరీర, నేత్ర దాతలకు ఘన నివాళి