భువనగిరి అర్బన్, అక్టోబర్ 1 : ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రయోగాత్మక సర్వేను పకగా జరిపించాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 3నుంచి నిర్వహించే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతకుమారి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం ఈ నెల 3నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పకాగా జరిపించాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే, నగరాలు, పట్టణ ప్రాంతాల విస్తరణకు ప్రతిపాదనలు, భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల సత్వర పరిషారం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం లబ్ధిదారుల ఎంపిక చేయాలని సూచించారు.
డిజిటల్ కార్డుల జారీకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రెండు గ్రామాల్లో ప్రయోగాత్మక సర్వే నిర్వహించాలని ఆదేశించారు. అర్బన్ నియోజకవర్గాల్లో రెండు వార్డులు/ డివిజన్లను ఎంపిక చేయాలన్నారు. ఇంటింటి పరిశీలన చేపట్టి ప్రతి కుటుంబం వివరాలను సమగ్రంగా పరిశీలించాలని, ఈ నెల 8నాటికి సర్వేను పూర్తి చేయాలని సూచించారు. 9న స్రూట్నీ జరిపి 10న సమగ్ర నివేదిక పంపించాలని మార్గనిర్దేశం చేశారు. ఏ ఒక కుటుంబం తప్పిపోకుండా సర్వేను పకడ్బందీగా జరిపించాలని, ఆర్డీఓ, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించి క్షేత్రస్థాయిలో సర్వే తీరును నిశితంగా పరిశీలన చేయాలని ఆదేశించారు.
సర్వే సందర్భంగా ఫ్యామిలీ ఫొటోను సేకరించడం తప్పనిసరి కాదని, ఫొటో కోసం ఎవరినీ ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు. రోజూ ఒకో బృందం 30 నుంచి 40 కుటుంబాల సర్వేను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకుని, గడువులోపు పూర్తి చేయించాలని అన్నారు. సర్వే తీరును పరిశీలించేందుకు జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ రాష్ట్ర స్థాయి అధికారులు పర్యటిస్తారని తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిషరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లను దసరా కానుకగా అందించేందుకు లబ్ధిదారుల ఎంపికకు విధివిధానాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ధాన్యం సేకరణ కోసం కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. సన్న రకం, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కేంద్రాలను నెలకొల్పాలని, ఈ నెల 15నాటికి ప్రతి మండలంలో కనీసం ఒక కొనుగోలు కేంద్రాన్ని తప్పనిసరిగా ప్రారంభించాలని ఆదేశించారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ వర్తింపజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గంగాధర్, బెన్షాలోమ్, జిల్లా రెవెన్యూ అధికారులు అమరేందర్, శేఖర్‌రెడ్డి, డీపీఓ సునంద, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.