భువనగిరికలెక్టరేట్, ఫిబ్రవరి 3 : నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లో పేలుళ్లకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు. శుక్రవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆలేరు మండలంలోని కందిగడ్డ శివారులోని జేఎస్ఆర్ సన్‌సిటీ వెంచర్లో గురువారం రాత్రి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లకు పాల్పడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. వెంచర్ సూపర్వైజర్లు ఎన్న లింగారెడ్డి, సల్లగురుగుల శ్రీనివాస్, ఆలకుంట్ల కమలాకర్ కంప్రెషర్ వర్కర్ ఆలకుంట్ల సుమలాకర్ను అదుపులోకి తీసుకోగా మహేందర్, తాడేపల్లి నారాయణ పరారైనట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద నుంచి 57జిలిటన్ స్టిక్స్, 51 డిటోనేటర్లు, మూడు కనెక్టింగ్ వైర్బిండల్స్, నాలుగు మొబైల్ ఫోన్లు, కంప్రెషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ కె. నర్సిహారెడ్డి, సీఐ నవీన్‌రెడ్డి, ఇద్రీస్‌అలీ, వెంకటశ్రీను పాల్గొన్నారు.