రామగిరి, అక్టోబర్ 8 : డీఎస్సీ-2024లో ర్యాంకు సాధించి 1:3 పద్ధతిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ముగియగా.. వివిధ కేటగిరీల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విద్యా శాఖ మంగళవార విడుదల చేసింది. అందులో ఎస్జీటీ, స్కూ ల్ అసిస్టెంట్ వివిధ సబ్జెక్టులు, ఎల్పి, పీఈటీ పోస్టులు సాధించిన వారున్నారు. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు డీఈఓ బి.భిక్షపతి పర్యవేక్షణలో ఫోన్లు చేసి సమాచారం అందించారు. వారికి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక ఉత్తర్వులను అందించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశాల మేరకు వారిని 11 బస్సుల్లో హైదరాబాద్ తీసుకువెళ్లేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. నల్లగొండ నుంచి 6, మిర్యాలగూడ నుంచి 3, దేవరకొండ నుంచి 2 బస్సులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఉదయం 6గంటలకు సంబంధిత లైజన్ ఆఫీసర్స్‌కు రిపోర్ట్ట్ చేయాలని అధికారులు సూచించారు. దసరా సెలవుల అనంతరం జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు. జిల్లావ్యాప్తంగా 605 పోస్టులను ఆయా కేటగిరీలో భర్తీ చేయాల్సి ఉండగా 535 పోస్టులను మాత్రమే అర్హులతో భర్తీ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
బస్సులు బయల్దేరే ప్రాంతాలు..
– ఎన్జీ కళాశాల – నల్లగొండ, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల-దేవరకొండ, ఎన్ఎస్ప్ క్యాంప్ ఆవరణ- మిర్యాలగూడ