
ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష
దత్తత పట్టణంలో పర్యటిస్తూ ప్రణాళికలకు ఆదేశాలు
రేపు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి బృందం రాక
అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై దృష్టి
ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్29(నమస్తే తెలంగాణ) : నల్లగొండను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని గత ఎన్నికల సమయంలో హామీనిచ్చిన ముఖ్యమంత్రి
కేసీఆర్ బుధవారం నల్లగొండ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్షించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తండ్రి దశ దినకర్మలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం.. గాదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే కిశోర్ తండ్రి మారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భోజనం అనంతరం అక్కడికక్కడే నిర్ణయం తీసుకుని నల్లగొండ అభివృద్ధిపై చర్చిద్దామని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, కలెక్టర్ పీజే పాటిల్‌కు సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో లేకున్నా అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు సంతోష్‌కుమార్, బడుగుల ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నల్లగొండలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం కిశోర్ తండ్రి మారయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. భోజనం అనంతరం నల్లగొండ అభివృద్ధిపై చర్చిద్దామంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌కు సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో లేకున్నా అక్కడి నుంచి నేరుగా సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్ ఛాంబర్లో సమావేశమై అభివృద్ధి పనులపై సమీక్షించారు. నల్లగొండ జిల్లా కేంద్ర అవసరాలపై ప్రత్యేకంగా చర్చించారు. స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఆయా వివరాలను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి కేసీఆర్‌కు అందజేశారు. సీఎం కేసీఆర్ కలెక్టర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి చర్చిస్తూ తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నల్లగొండ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా అభివృద్ధి పనులు ఉండాలని సూచించారు. పట్టణ పరిధిలోని అన్ని ప్రధాన రహదారులను సుమారు 25మీటర్ల మేర ఆరులేన్లుగా వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వీటితో పాటు నాగార్జున కళాశాల నూతన భవనం కోసం రూ.36కోట్లు కేటాయిస్తూ జీఓ ఇచ్చేలా సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశిస్తానని రివ్యూ సమావేశంలోనే కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా టౌన్‌హాల్‌ను అత్యాధునిక సౌకర్యాలతో విశాలంగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పానగల్ రిజర్వాయర్‌ను ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయాలని, పక్కనే శిల్పా కళారామం నిర్మాణానికి కూడా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. నల్లగొండను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కిశోర్ కుమార్‌కు ముఖ్యమంత్రి పరామర్శ
నల్లగొండ, డిసెంబర్ 29 : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ తండ్రి దశదినకర్మలో పాల్గొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కిశోర్ తండ్రి మారయ్య చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా నల్లగొండకు చేరుకున్న సీఎం ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగారు. అక్కడి నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కనకదుర్గ కాలనీలోని పీటీఆర్ కాలనీలో ఉన్న కిశోర్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కిశోర్‌ను పరామర్శించిన అనంతరం మంత్రులు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి గాదరి మారయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిశోర్ నివాసంలోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిశోర్ తల్లి సీఎంను చూసి కంట నీరు పెట్టుకోగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం కిశోర్ కుమారులను దగ్గరకు తీసుకున్నారు. మారయ్య గతం, ఆయన ఉద్యోగం వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం కేసీఆర్ ప్రేమకు పాదాభివందనం : ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఎప్పుడూ ఉంటుందని, ఆయన ప్రేమకు పాదాభివందనమని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం హెలిప్యాడ్ వద్ద నమస్తే తెలంగాణతో మాట్లాడారు. గతంలో నల్లగొండను దత్తత తీసుకుంటానని ఇచ్చిన మాట మేరకు ఇవ్వాళ ప్రత్యేకంగా సమీక్ష చేశారన్నారు. గత రెండేండ్లుగా కరోనాతో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, ఇక నుంచి అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. పట్టణానికి అవసరమైన అభివృద్ధి పనులన్నింటినీ మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఐటీ హబ్, మెడికల్ కాలేజీ, నూతన టౌన్‌హాల్, ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్లు, ట్యాంక్‌బండ్, సెంట్రల్ లైటింగ్‌తో రోడ్లు విస్తరణ ఇలా సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు ఇస్తామని కేసీఆర్ తెలిపారని వెల్లడించారు. నల్లగొండపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని అన్నారు. నల్లగొండ గడ్డ కూడా ఎల్లప్పుడూ కేసీఆర్‌కు అడ్డాగా ఉంటుందని భూపాల్‌రెడ్డి ప్రకటించారు. మంత్రుల పర్యటన తదనంతర పరిణామాలతో నల్లగొండ రూపురేఖలు మారనున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
పట్టణంలో ముఖ్యమంత్రి పర్యటన…
కలెక్టరేట్లో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ పట్టణంలో పర్యటించారు. ప్రత్యేక బస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ కలెక్టరేట్ నుంచి రోడ్లను పరిశీలిస్తూ బస్టాండ్ మీదుగా ఇరిగేషన్ కార్యాలయం వరకు చేరుకున్నారు. అక్కడ బస్సు దిగి నేరుగా ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలోకి నడుచుకుంటూ వెళ్లారు. కార్యాలయ ఆవరణ, స్థలాన్ని పరిశీలించారు. మొత్తం ఎంత స్థలం అందుబాటులో ఉన్నదని ఆరా తీశారు. సమీపంలోని కార్యాలయాల వివరాలను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, కలెక్టర్ పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఏడెనిమిది ఎకరాల వరకు స్థలం ఉండవచ్చని తెలుపగా సర్వే చేసి నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.