
యాదాద్రి, ఆగస్టు 23 : శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై ఉన్న రామలింగేశ్వరస్వామికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుణ్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేశారు.
యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు
లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకించి, పట్టువస్ర్తాలను ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వేకువజామున ఆరాధన, సహస్ర నామార్చన, సువర్ణపుష్పార్చన నిర్వహించారు. సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో కల్యాణతంతు నిర్వహించారు. భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని వ్రతమాచరించారు. శ్రీవారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.
గిరి ప్రదక్షిణ రోడ్డుకు మెరుగులు
గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వైటీడీఏ అధికారులు మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే గిరిప్రదక్షిణ రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదాన్ని పంచే మొక్కలు, గార్డెనింగ్‌తోపాటు మెట్ల నిర్మాణాలు చేపట్టగా సోమవారం రోడ్డుకు పార్కింగ్ టైల్స్‌ను బిగించారు. సుమారు 2.5 కిలోమీటర్ల వరకు టైల్స్ నిర్మించడంతో పాటు అక్కడక్కడ సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. అలాగే యాదాద్రీశుడి ప్రసాద లడ్డూ తయారీకి వినియోగించే అధునాతన యంత్రాల బిగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. లడ్డూల ట్రేలు సోమవారం యాదాద్రికి చేరుకున్నాయి.